దోమ, డిసెంబర్ 9: వర్షాలు అనుకున్న స్థాయి కంటే అత్యధిక స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలలోని రైతులు ఈ యాసంగిలో వేరుశనగ పండించారు. దీంతో మండల వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో సాగు నమోదు అయింది. మండల వ్యాప్తంగా వేరుశనగను 2250 మంది రైతులు 3,075 ఎకరాల్లో సాగు చేశారు.
వ్యవసాయానికి టెక్నాలజీ తోడవడంతో తుంపర సేద్యం(స్పింక్లర్లు)తో రైతులు ఎగుడు దిగుడు పొలాల్లో సైతం వేరుశనగ పంటను విరివిగా సాగు చేస్తున్నారు. పంట విత్తిన తరువాత కలుపు నివారణ, సస్యరక్షణ చర్యలతో పాటుగా నీటి యాజమాన్య పద్ధతులను సరియైన సమయాల్లో పాటిస్తే మంచి దిగుబడులు సాధిం చవచ్చు. వేరుశనగ పంటకాలం 120 నుంచి 130 రోజులు కాగా ప్రస్తుతం 60 రోజుల దశలో పంట ఆశాజనకంగా ఉంది. మంచి యాజమాన్య పద్ధతులను సరియైన సమ యం లో పాటిస్తే ఎకరం పొలంలో పది నుంచి పన్నెండు క్వింటాళ్ల దిగుబడి పొంద వచ్చునని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగిలో వాతావరణం అను కూలంగా ఉండటంతో వేరుశనగ పంటకు తెగుళ్లు ఎక్కువగా కనిపించలేదన్నారు. పంట ఆరోగ్యంగా ఉండటంతో మంచి దిగుబడులు వస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
15 ఎకరాల్లో వేశా..
నాకు 20 ఎకరాల పొలం ఉంది. అందులో ఐదు ఎకరాల పొలం లో వరి పంట సాగు చేశాను. మిగతా 15 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. పంటకు నీటి తడులను తుంపర సేద్యం (స్పింక్లర్ల) ద్వారా అందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత నిరంతరం కరెంటు సరఫరా ఉం డటంతో 15 ఎకరాల్లో వేరుశనగ పంట వేసేందుకు వీలుపడింది. లేకుంటే ఏదో మూడు నాలుగు ఎకరాలకే పరిమితం అయ్యేది.
– నందిపేట చిన్నమల్లయ్య, కొండాయపల్లి గ్రామం,
పంట సాగు పెంచాను…
నాకు మూడు ఎకరాల పొలం ఉండగా ఎకరంలో వరి సాగు చేసి మరో రెండు ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాను. బోరు బావిలో నీరు పుష్కలంగా ఉం డటంతో పాటుగా కరెం టు సరఫరా బాగుండటంతో నా పొలంతో పాటు పక్కన ఉన్న మరో రైతుకు చెందిన ఐదు ఎకరాల పొలంను లీజుకు తీసుకొని వేరుశనగ పంట సాగు చేశాను. పంట ఆశాజ నకగా ఉంది. మంచి ఆదాయం వస్తుందని అను కుంటున్నాను
– పోతర్గారి రాములు, దిర్సంపల్లి గ్రామం
సలహాలు ఇస్తున్నాం…
మండల పరిదిలో వేరుశనగ పంట పెద్ద మొత్తంలో రైతులు సాగు చేశారు. ఏఈవోలతో కలిసి రైతుల పొలాల ద్గరకు వెళ్లి పంటలకు పట్టిన చీడపీడలకు సంబంధించిన నివారణా చర్యలు తదితర విషయాలపై వివరించాం. తగిన మందులు, సస్య రక్షణ చర్యలు, నీటి యాజమాన్యం వంటి వాటిని సకాలంలో పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం.
– ప్రభాకర్‌రావు మండల వ్యవసాయ అధికారి, దోమ