ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 25 : ‘మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇండ్లు కోల్పోయే ఆక్రమణదారులకు నచ్చజెప్పండి..’.. అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. బుధవారం రాజేంద్రనగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి, అక్రమ నిర్మాణాల తొలగింపుపై సంబంధిత అధికారులతో రంగారెడ్డి కలెక్టర్ శశాంక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూసీ పరీవాహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించేందుకు అర్హుల వివరాలను సేకరించాలన్నారు. జిల్లాలోని గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో 332 అక్రమ నిర్మాణాలను గుర్తించామన్నారు. ఈ నిర్మాణాలను తొలగించాల్సి ఉన్నందున వారికి మరోచోట డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు.
మొదటగా నాలుగు బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ టీముల్లో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, సర్వే డిపార్ట్మెంట్, ఇతర సిబ్బంది 8 నుంచి 10 మంది ఉంటారన్నారు. ఈ బృందాలు ఇంటి యజమానికి సంబంధించిన ఆధార్ కార్టు, ఇంటి పేపర్లు, కరెంట్ బిల్లు, అనుమతులు తదితర డాటాను సేకరించాలని సూచించారు. ఇప్పుడుంటున్న ఇండ్లకు వరద ముప్పు ఉన్నదని వారికి వివరించాలన్నారు. వీరికి ఇచ్చే డబుల్బెడ్రూం ఇండ్ల కేటాయింపు కోసం వారిచేతే డ్రా తీయిస్తామన్నారు. ఖాళీ చేయించే సమయంలో రవాణా ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బృందాలు తమతమ పరిధుల్లోని ఆక్రమణదారులను పిలిచి నచ్చచెప్పాలన్నారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివాసాలు కమర్షియల్ ఆక్రమణలు ఏ మేరకు ఉన్నాయో వివరాలు సేకరించాలన్నారు. పోలీసు శాఖ నుంచి సరైన సహకారం కల్పించాలని పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మూసీ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ ఎండీ గౌతమి, డీసీపీ శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్, మూసీ రివర్స్ డెవలపర్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, రాజేంద్రనగర్ మున్సిపల్ కమిషనర్ రవికుమార్, నార్సింగ్ మున్సిపల్ అధికారులు, రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు, నాలుగు బృంధాల డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.