తాండూరు, మే 30 : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ.. అన్నదాతలపై సీఎం రేవంత్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని జుంటుపల్లిలోని కొనుగోలు కేం ద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగ్యానాయక్తోపాటు మిల్లర్లతో ఫోన్లో మాట్లాడారు.
రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. రైతన్న ఇబ్బందుల్లో ఉంటే సర్కార్ అస్సలు పట్టించుకోవడమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పక్షపాతి అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు రైతు కంఠకంగా మారిందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో కరోనా వచ్చినా, నోట్లు రద్దు అయినా ఏ రోజు కూడా రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఆపలేదన్నారు.
ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేసి.. ప్రతి రైతు నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరించి.. వారి బ్యాంకు ఖాతాల్లో సకాలంలో డబ్బులను జమ చేసినట్లు గుర్తు చేశారు. యాసంగి కొనుగోళ్లలో ప్రతి క్వింటాకు తరుగు పేరు తో నాలుగు నుంచి ఎనిమిది కిలోల వరకు ధాన్యాన్ని కట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుంటే తన కడుపు తరుక్కుపోతున్న దన్నారు.
ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కూ డా కొనాలని రైతుల పక్షాన డిమాండ్ చేశా రు. సీఎం పక్క నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన అన్నదాతల పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోవడం కూడా కష్టంగా ఉన్నదన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ..ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్లు చరిత్రలో ఎక్క డా లేదన్నారు. తడిసిన ధాన్యంతోపాటు వర్షాలకు దెబ్బతిన్న కూరగాయలు, మా మిడి పంటలు వేసిన రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.