షాబాద్, జూన్ 3: రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని షాబాద్ తహసీల్దార్ ఎండీ అన్వర్ అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పోలారం, బొబ్బిలిగామ గ్రామాల్లో సిబ్బందితో కలిసి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అనంతరం రైతుల భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ ఎండీ అన్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భూరతి చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న రైతుల భూ సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భూముల రికార్డుల్లో తప్పులు, మిస్సింగ్‌లు, సర్వే నెంబర్లలో విస్తీర్ణంలో తప్పు, ఒప్పులకు సంబంధించి రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండలంలోని 25 రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 20వ తేదీ వరకు గ్రామాల వారీగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.