కులకచర్ల/పరిగి, జూన్ 10 : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంబర్ 2 పాఠశాల ఉపాధ్యాయులు అమర్నాథ్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల పరిధిలోని విద్యారణ్యపురి, కిష్టమ్మగుడితండా, చిగురాల్‌పల్లి, గోవిందాపూర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని తెలిపారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలు, రెండు జతల బట్టలు ఇవ్వడంతో పాటు అల్పాహారం, రాగిజావ, సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్నభోజనం ఉంటుందన్నారు. దీనితో పాటు స్కాలర్షిప్ అవకాశం కూడా ఉంటుందని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, శ్రీనివాసరావు, బాలయ్య పాల్గొన్నారు.
కొడంగల్ : బడీడు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రధానోపాధ్యాయులు క్రాంతికుమార్ అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి గ్రామంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు స్కూల్ యూనిఫాం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సంధ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
దోమ : మండల పరిధిలోని బొంపల్లి కాంప్లెక్స్ పరిధిలోని బొంపల్లి, బాసుపల్లి గ్రామాల్లో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి ఎంఈవో హరిశ్చందర్ ఇంటింటి వెళ్లి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులను వివరించారు. వారి వెంట ఎంపీడీవో మహేశ్‌బాబు, హెచ్ఎంలో వెంకట్, సుహాసిని, ఉపాధ్యాయులు, పాఠశాలల చైర్మన్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
కులకచర్ల : ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలని కులకచర్ల జడ్పీటీసీ రాందాస్‌నాయక్ అన్నారు. సోమవారం చౌడాపూర్ మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో చౌడాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తౌవుర్యనాయక్, చౌడాపూర్ మండల సమాఖ్య అధ్యక్షురాలు అలవేలు, ఆర్ఐ లింగయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బొంరాస్‌పేట : బడిబాట కార్యక్రమం మండలంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం వంటి సౌకర్యాలను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. సోమవారం తుంకిమెట్ల, ఏర్పుమళ్ల, రేగడిమైలారం, దుప్చెర్లలో నిర్వహించిన బడిబాటలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థిని బడికి పంపించాలి
కులకచర్ల : గ్రామాల్లో బడిబయట ఉన్న ప్రతి విద్యార్థిని బడికి పంపించాలని కులకచర్ల ఎంపీడీవో రామకృష్ణనాయక్ తెలిపారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని బిందెంగడ్డతండాలోని బడిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో బిందెంగడ్డతండా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఎఫ్ఏ చంద్రమౌళి, గ్రామస్తులు పాల్గొన్నారు.