బొంరాస్‌పేట, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఏకరూప దుస్తులను(యూనిఫాంలు) ఉచితంగా పంపిణీ చేస్తున్నది. పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు యూనిఫాంలను కూడా విద్యార్థులకు పంపిణీ చేయడానికి విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నది. మహిళలకు ఉపాధి లభిస్తుందని గత ఏడాది నుంచి యూనిఫాం కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వం విద్యార్థుల యూనిఫాంను కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించింది. యూనిఫాం కుట్టు పని ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు. వికారాబాద్ జిల్లాలో ఏకరూప దుస్తులు కుట్టే పని ముమ్మరంగా కొనసాగుతున్నది.
జిల్లాస్థాయి అధికారులు మహిళా శక్తి కుట్టు కేంద్రాలను సందర్శించి యూనిఫాం కుట్టే పనులను పరిశీలించారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంను పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతానికి ఒక జత యూనిఫాం కుట్టడానికి అవసరమ్యే వస్ర్తాన్ని మహిళా సంఘాలకు సరఫరా చేశారు. జిల్లాలోని 19 మండలాల్లో 950 పాఠశాలలు ఉండగా వీటిలో చదువుతున్న 72,764 మంది విద్యార్థులకు ఒక జత ఏకరూప దుస్తులు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో జతకు కుట్టు కూలీ రూ.50 అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 12వ తేదీలోగా పాఠశాలలకు కుట్టిన యూనిఫాంను అందజేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
విద్యార్థుల ఏకరూప దుస్తులు కుట్టడానికి వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 94 మహిళా శక్తి కుట్టు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నవాబ్‌పేటలో 7, వికారాబాద్‌లో 4, పరిగిలో 2, మర్పల్లిలో 3, యాలాలలో 3, కోట్‌పల్లిలో 4, బంటారంలో 5, తాండూరులో 6, బషీరాబాద్‌లో 9, బొంరాస్‌పేటలో 5, ధారూరులో 5, పూడూరులో 4, పెద్దేముల్లో 4, కొడంగల్‌లో 4, మోమిన్‌పేటలో 5, కులకచర్లలో 9, దోమలో 6, దౌల్తాబాద్‌లో 5, చౌడాపూర్‌లో 4 కుట్టు కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. వీటిలో 743 మంది మహిళలు యూనిఫాం కుడుతున్నారు. బుధవారం నాటికి 85 శాతం కుట్టుపని పూర్తయిందని అధికారులు తెలిపారు. పూర్తయిన యూనిఫాంను ప్యాకింగ్ చేసి పాఠశాలలకు చేరవేస్తున్నారు.
ఏకరూప దుస్తులు కుట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరపై మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బయట టైలర్లు ఒక్కో జత కుట్టడానికి రూ.300ల నుంచి రూ.400లు వసూలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఒక జతకు రూ.50లుగా నిర్ణయించింది. ఇది చాలా తక్కువని మహిళలు పెదవి విరుస్తున్నారు. బటన్లు, దారం ఇతర ధరలు బాగా పెరిగాయని ప్రభుత్వం ఇచ్చే కూలీ ఏమాత్రం గిట్టదని వారు చెబుతున్నారు. జతకు రూ.75లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంకా ఉత్తర్వులు రాలేదని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా యూనిఫాం కుట్టే పనిని తొలిసారిగా మహిళలకు ఇవ్వడంతో కుట్టుపనిలో ఎంత నాణ్యత ఉంటుందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల యూనిఫాం కుట్టే పనిని మహిళా సంఘాలకు ఇవ్వడం వల్ల మాకు ఉపాధి లభిస్తున్నది. మున్ముందు కూడా దీనిని కొనసాగించాలి. కానీ ప్రభుత్వం ఇస్తున్న కూలీ మాత్రం గిట్టడం లేదు. ఒక యూనిఫాం కుట్టాలంటే బయట రూ.300ల వరకు తీసుకుంటున్నారు. అన్నీ ధరలు పెరిగాయి. కుట్టిన యూనిఫాంకు బటన్లు, కాజలు వేయడానికి తాండూరుకు తీసుకెళ్లాలి. ట్రాన్స్పోర్ట్ చార్జీలు మాపైనే పడుతున్నాయి. ప్రభుత్వం జతకు రూ.100 అయినా చెల్లించాలి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను మహిళల ద్వారా కుట్టిస్తున్నాం. జిల్లాలో 94 కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు 85 శాతం కుట్టు పని పూర్తయింది. కుట్టిన యూనిఫాంను ప్యాక్‌చేసి పాఠశాలలకు చేరవేస్తున్నాం. 12 లోపు అన్ని పాఠశాలలకు యూనిఫాం అందజేస్తాం. ప్రస్తుతానికి ఒక జతకు సరిపోయే వస్ర్తాన్ని ఇచ్చారు. ఇంకో జత వస్త్రం వచ్చిన తరువాత దానిని కూడా మహిళలకు అందజేస్తాం. ఒక జత యూనిఫాం కుట్టడానికి కూలీ రూ.50లుగా ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన కూలీపై ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు.