‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రైవేటు స్కూళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడనున్నది. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు నిబంధనలను ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేయనున్నది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమల్లోకి రానుండడంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానున్నది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1305 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా, ప్రతి పాఠశాల ప్రభుత్వ నిబంధనల మేరకు కొనసాగాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని విద్యా శాఖ హెచ్చరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. ఇందుకు ప్రతి పాఠశాలలో అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే సర్కారు బడుల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు వస్తుండడం గమనార్హం. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో విద్యావ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు మంచిరోజులు రానున్నాయి. సర్కారు బడుల దశ-దిశ మార్చేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేయనుంది. వచ్చే మూడేండ్లలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించనున్నారు. తొలుత అధిక విద్యార్థులు గల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించి, అనంతరం మిగతా పాఠశాలల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, ప్రతీ పాఠశాలకు తాగునీటి సరఫరా, ఫర్నిచర్, పాఠశాలకు రంగులు, పాఠశాల భవన మరమ్మతులు, చాక్బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. దీంతో ఏడాదిలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. పేద విద్యార్థులకు మిథ్యగా మారిన ఇంగ్లిష్ మీడియం సర్కారు బడుల్లో వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు అందుబాటులోకి రానుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ స్కూళ్లను పూర్తిగా నియంత్రించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని అమల్లోకి తీసుకురావడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించనున్నది. టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో సమూల మార్పునకు చర్యలు చేపట్టింది. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూల్ డ్రెస్సులు ఉచితంగా అందిస్తుండడం, పదో తరగతి పరీక్షల్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు, విద్యార్థుల దత్తత కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫీజులను నియంత్రించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నది. జిల్లాలో మొత్తం 1305 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లున్నాయి. జిల్లాలోని సరూర్నగర్, రాజేంద్రనగర్, హయత్నగర్, గండిపేట తదితర మండలాల్లో అధిక సంఖ్యలో ప్రైవేట్ స్కూళ్లున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు కార్పొరేట్, టెక్నో, ఈ-టెక్నో స్కూళ్లంటూ పేర్లు పెట్టి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.
అర్హులైన టీచర్లు లేకుండానే స్కూళ్లను నడిపిస్తూ జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే కోరికతో ప్రైవేట్ స్కూళ్ల మాయలో పడి అడిగినంత ఫీజులను తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. పాఠ్యపుస్తకాల నుంచి యూనిఫాంలు, స్టేషనరీ పేరిట దోపిడీ చేస్తున్నారు.. జిల్లాలోని కొన్ని కార్పొరేట్, టెక్నో స్కూళ్లల్లో ఒకటో తరగతి విద్యార్థికి కూడా రవాణా ఇతర ఖర్చులు కాకుండా కేవలం స్కూల్ ఫీజు రూపంలో రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు.
ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు పెంచే విషయంలో తప్పనిసరిగా సంబంధిత స్కూల్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసి, జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి అనుమతి పొందిన అనంతరం ఫీజును పెంచాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం నిబంధనలేమీ పాటించకుండానే నిర్వాహకులు ప్రైవేట్ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఎలాంటి అనుమతులు లేకున్నా కొనసాగుతున్నాయి.