గత నెల 26న రేవంత్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా రేషన్‌కార్డులు, ఆత్మీయభరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. అయితే, అందులో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసి అక్కడి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించింది. ఈ విధంగా జిల్లాలోని 20 మండలాల్లోని 20 గ్రామాల్లో 2,832 మంది లబ్ధిదారులకు పత్రాలను ఇచ్చింది.
లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి దాదాపు గా 20 రోజులు దాటుతున్నా పైసా నిధులను ప్రభు త్వం కేటాయించలేదు. కాగా, పైలట్ గ్రామాల్లోని లబ్ధిదారులు నెల రోజుల్లోగా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని లేకుంటే, మరొకరిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని షరతు విధించ డంతో వారు ప్రభుత్వం తీరుపై భగ్గుమంటున్నారు. కాసులివ్వకుండా కండిషన్స్ ఎలా పెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-వికారాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకంలోనూ ఏదో ఒక కొర్రీ పెడుతున్నది. రుణమాఫీ మొదలుకొని గతనెల 26న అమల్లోకి తీసుకొచ్చిన రేషన్‌కార్డులు, ఆత్మీయభరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాల వరకు చాలా మంది అర్హులకు ఏదో విధంగా మొండిచెయ్యి చూపుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసి అక్కడ లబ్ధిదారులను గుర్తించారు. ఈ విధంగా జిల్లాలోని 20 మండలాల్లోని 20 గ్రామాల్లో 2,832 మంది లబ్ధిదారులను అర్హులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ప్రొసీడింగ్ కాపీలను అందించింది. కాగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి విడతల వారీగా రూ.5 లక్షల ఆర్థిక సాయా న్ని అందించాలని సర్కార్ నిర్ణయించింది.
అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా.. అర్హులకు దాదాపుగా 20 రోజులు కావొస్తున్నా ప్రొసీడింగ్ కాపీలు తప్పా పైసా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. లబ్ధిదారులకు నిధులివ్వడం మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్‌తోపాటు షరతులను విధించింది. పైలట్ గ్రామాల్లో లబ్ధిదారులు నెల రోజుల్లోగా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని నిబంధన పెట్టింది. ఒకవేళ లబ్ధిదారులు ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే మరొకరిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారంటూ ప్రచా రం గ్రామాల్లో జోరుగా సాగుతున్నది. దీంతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులుగా ఎంపికైన వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రూపాయీ ఇవ్వకుండా షరతులు పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని జిల్లాలోని ప్రజలు నిలదీస్తున్నారు. కాసులివ్వకుండా కండిషన్స్ ఎలా పెడతారంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుండడంతో వారు మొహం చాటేస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ కేవలం పైలట్ గ్రామాలతోనే సరిపెట్టింది. మండలానికి ఒక గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించింది. దాదాపుగా 20 రోజులు గడిచినా తదుపరి లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోకపోవడంతో వేలాది మంది అర్హులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి రాగానే ఇల్లులేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి.. గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేస్తుండడంతో ప్రజలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం మం డలానికి ఒక్క గ్రామాన్ని మాత్రమే.. అది కూడా తక్కువ జనాభా ఉన్న గ్రా మాలను ఎంచుకుని.. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందించారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, జిల్లాలో అర్హులైన వారు 1,70,000 మంది వరకు ఉండగా కేవలం 2,832 మందిని మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేసి.. ఊరూరా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుండడంపై జిల్లా అంతటా అసంతృప్తి వ్యక్తం అవుతున్నది.
ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయగా, ప్రజాపాలనతోపాటు గతంలో స్వీకరించిన వాటిలో 2,50,000 దరఖాస్తులుండగా, వాటిలో 1,70,000 దరఖాస్తుదారులను అర్హులుగా తేల్చారు. వారేకాకుండా గత నెలలో నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లోనూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జిల్లావ్యాప్తంగా గ్రామ సభల్లో 26,312 దరఖాస్తులు రాగా.. అయితే వాటి పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.