రంగారెడ్డి, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ నేడు జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ను వేధించాలని చూస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలోని దివాళా కోరు కాంగ్రెస్ సర్కార్ ఏదో ఒక డ్రామా ఆడి ప్రతిపక్షాలు, ప్రజల అటెన్షన్‌ను డైవర్ట్ చేసే కుట్రలకు పాల్పడుతున్నదని.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు అనేది రేవంత్‌రెడ్డి రాక్షసానందానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. తాను ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో అందుబాటులో ఉంటానని అక్కడికి రావాలని సిట్ అధికారులకు చెప్పినా నందినగర్‌లోనే విచారిస్తామని ఇబ్బంది పెడుతున్నారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బైకు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలను కొనసాగించాలన్నారు.