కోట్పల్లి, ఫిబ్రవరి 12 : అనుకున్నంత ఉత్పత్తులు లేకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశన్నంటే స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కూరగాయల రైతులను ప్రోత్సహిస్తున్నది. కూరగాయల సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు వందశాతం సబ్సిడీతో రుణాలను అందిస్తున్నది. మామూలుగా కూరగాయల సాగు చేస్తే తెగుళ్లు అధికంగా వస్తాయి. దీంతో దిగుబడి కూడా చాలా వరకు తగ్గుతున్నది. అధిక దిగుబడితో పాటు ఆసక్తిని పెంచేలా ఉండేందుకు వీలుగా తెలంగాణ సర్కారు కూరగాయల పందిళ్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. దీంతో రైతులు శాశ్వత పందిళ్ల సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
కోట్పల్లి మండలంలోని నాగసాన్పల్లి, మోత్కుపల్లి, ఇందోల్, లింగంపల్లి, రాంపూర్, కంకణాలపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో టమాట, సోరకాయ, వంకాయ, బెండకాయ, కాకరకాయ, కాలిఫ్లవర్, చిక్కుడు, తదితర కూరగాయలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. తీగజాతి, కూరగాయలు కాకర, చిక్కుడు, బీరకాయ, సోరకాయలు జనాభా అవసరాలను సరిపడా మొత్తంలో రావడం లేదు. ఈ క్రమంలో తీగజాతి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో కోట్పల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని దాదాపుగా 30 మంది రైతులు పదిరి సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.
సబ్సిడీ ఇలా..
శాశ్వత పందిరి పద్ధతిలో కూరగాయల సాగు ఖర్చుతో కూడుకున్నది. ఎకరాకు 150 రాతి కడీలు. తీగలు ఏర్పాటు చేయాలి, దీనికి అయ్యే ఖర్చు సబ్సిడీలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా వస్తువులు, కూలీల ఖర్చును ఇవ్వనున్నది. ఐదెకరాల్లోపు ఉన్న వారికి వంద శాతం సబ్సిడీతో రైతు ఖాతాల్లో లక్ష రూపాయలను జమ చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీతో డ్రిప్పు ఇస్తున్నది. నీటి వసతి ఉండి ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత ఉద్యానశాఖ, ఈజీఎస్ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుని అధిక లాభాలను పొందవచ్చు.