వికారాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం జోరందుకున్నది. వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో మొక్కలు నాటడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, స్థలాల్లో మొక్కలను నాటుతున్నారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా అధికారులు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం గుంతల తవ్వకం నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకు ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేస్తున్నారు.
మొక్కలు నాటి నేవిగేషన్‌తో కూడిన ఫొటోలు తీయడంతోపాటు అవసరమైన వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. జియో ట్యాగింగ్‌తో నాటిన మొక్క ఏ విధంగా ఉందనేది ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. వనమహోత్సవంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములై ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటుతున్నారు.

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 40.48 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 14.70 లక్షల మొక్కలను నాటడం పూర్తిచేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 250 మొక్కలు, ఉద్యానవన శాఖ 98 వేలు, పరిశ్రమల శాఖ 2500, అటవీ శాఖ 1.04 లక్షలు, డీఆర్డీఏ 12.43 లక్షలు, ఎక్సైజ్ శాఖ, వ్యవసాయ శాఖ 10 వేలు, తాండూరు మున్సిపాలిటీలో 2550, వికారాబాద్ మున్సిపాలిటీలో 1200 మొక్కలను నాటారు.
ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వనమహోత్సవంలో భాగంగా నాటుతున్న మొక్కలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను పెంచారు. గతేడాది 40.49 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 38.70 లక్షల మొక్కలను నాటినట్లు అధికారులు తెలిపారు.