Rythu Vedika | షాబాద్, జూలై 5: అన్నదాతల సంక్షేమానికి పెద్దఫీట వేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం… రైతుల ప్రయోజనాల కోసం పంటల సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు ఎలాంటి పంటలు వేయాలి..? ఏ విత్తనాలు ఎంపిక చేసుకోవాలి…? ప్రభుత్వ పథకాలను ఏ విధంగా అందుకోవాలి…? వంటి అంశాలపై రైతులకు ఆయా క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలలో సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు శిక్షణలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 83 రైతువేదికల నిర్మాణం చేపట్టి, వీటి నిర్వహణకు ప్రతినెల రూ.9 వేలు అప్పటి ప్రభుత్వం అందించేది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర నుండి రైతువేదికల నిర్వహణకు డబ్బులు ఇవ్వకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్వహణ డబ్బులు తమ జేబుల్లో నుండి పెట్టుకుంటుండడంతో ఆర్థిక భారం పడుతుందని వాపోతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 83 రైతువేదికలు…
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఆమనగల్లు(కల్వకుర్తి)నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 83 రైతువేదిక భవనాలను నిర్మాణం చేసింది. ఒక్కొ రైతువేదికకు రూ. 24 లక్షలతో మొత్తం సుమారు రూ. 20 కోట్ల వరకు వెచ్చించి వీటిని నిర్మించడం జరిగింది. అందులో పెద్ద సమావేశపు హాలు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యేక గది, అధికారులు, రైతుల కోసం కుర్చీలు, బల్లలు, మైక్‌సెట్‌తో పాటు టీవీ, నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసి వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం కల్పించారు. రైతు వేదిక భవనాల్లో లోపల, బయట వ్యవసాయ పంటలకు సంబంధించిన బొమ్మలు వేయడంతో పాటు పంటల సాగులో పాటించాల్సిన జాగ్రతలను, అంశాలను గోడలపై రాయించారు. సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టిన ఈ వేదికలు మంచి వాతావరణంలో రైతులకు, అధికారులకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టింది. కాగా వీటి నిర్వహణకు కూడా నెలకు రూ. 9వేల చొప్పున అందించింది. అధికారులు క్లస్టర్ల వారీగా ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలో ఈ నిధులు జమ అయ్యేయి. ఈ నిధులతో కరెంట్, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం నిధులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
భారంగా మారిన నిర్వహణ
వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల నిర్వహణకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా నయా పైసా ఇవ్వడం లేదు. దీంతో సంబంధిత ఏఈఓలు తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్వహణ ఖర్చులు రోజురోజుకు పెరిగి అదనపు భారం మీదపడడంతో ఏఈఓలు తలలు పట్టుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వీపర్‌కు రూ.3వేలు, సమావేశాల శిక్షణల కోసం రూ.2,500, స్టేషనరీకి రూ.1000, తాగునీటి కోసం రూ.500, చిన్న చిన్న మరమ్మత్తులు, ఇతర ఖర్చులకు మరో రూ.1000, కరెంటు బిల్లుకు రూ.1000 కలిపి మొత్తం నెలకు రూ.9 వేలు అందించేది. కాంగ్రెస్ సర్కారు ఈ నిధులు విడుదల చేయకపోవడంతో ఏడాదిన్నరగా పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారింది. సంబంధిత వ్యవసాయ అధికారులపై ఆర్థిక భారం పడుతుంది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతువేదికల్లోనే రైతునేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ నిధులు ఇవ్వకపోవడంతో అధికారులకు కష్టంగా మారింది.
ప్రభుత్వానికి ప్రదిపాదనలు పంపించాం : నర్సింహారావు, రంగారెడ్డిజిల్లా వ్యవసాయశాఖ అధికారి
రైతు వేదికల నిర్వహణకు సంబంధించి నెల నెల రావాల్సిన నిధులపై ప్రభుత్వానికి ప్రదిపాదనలు పంపించాం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 83 రైతువేదికలున్నాయి. వీటికి నిర్వహణ కింద నెలకు రూ.9వేలు అందించాల్సి ఉండగా, గత ఏడాదిన్నరగా నిధులు రాలేదు. నెలవారి ఖర్చులు తమ సిబ్బంది(ఏఈఓలు)సొంత డబ్బులు పెట్టుకుంటున్నారు. నిధుల గురించి ప్రభుత్వానికి ప్రదిపాదనలు పంపించాము కానీ ఇప్పటివరకు ఇంకా నిధులు విడుదల కాలేదు.