కొడంగల్, అక్టోబర్ 27 : అధైర్యపడొద్దని.. ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి భరోసా ఇ చ్చారు. ఆదివారం ఆయన దుద్యాల మండలంలోని రోటిబండ తండాలో శుక్రవారం ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొని గాయపడ్డ రైతులను పరామర్శించారు. తండాకు మాజీ ఎమ్మెల్యే రావడంతో గిరిజనులు ఒక్కసారిగా ఆయన్ను హత్తుకుని కంటతడి పెట్టారు. కేసీఆర్ కాలంలో రైతులు ఆనందంగా ఉన్నారని, రేవంత్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములను వదులుకొని ఎక్కడికి పోవాలే… ఏం తినాలని కన్నీటిపర్యంతమ య్యారు.
ఈ సందర్భంగా తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఫార్మా భూబాధిత రైతులతో మాట్లాడుతూ.. రైతులంతా కలిసికట్టుగా ఉండి భూములను కాపాడుకోవాలని.. ప్రభుత్వం, అధికారుల ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. ఇక్కడి భూముల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటైతే పరిసరాలు కాలుష్యంగా మారి అందరి జీవితాలు నాశనమవుతాయని, జడ్చర్లలోని అరబిందో ఫార్మా కంపెనీతో ఆ ప్రాంతం కాలుష్యంగా మారి ప్రజలు అల్లాడుతున్నారని గుర్తించిన సొంత పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అరబిందో ఫార్మా కంపెనీని అక్కడి నుంచి తరిమి కొడతామని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ఉన్న బుద్ధి సీఎం రేవంత్‌రెడ్డికి ఎందుకు లేదని మండిపడ్డారు.
ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి.. సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. వారి బతుకులను రోడ్డుపాలు చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ఎవరొచ్చినా ఫార్మా విలేజ్‌కు సెంటు భూమిని కూడా ఇవ్వొద్దని.. ప్రభుత్వంతో పోరాటానికి రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంద ని ఆయన హామీ ఇచ్చారు. ఈ నెల 25న జరిగిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చాలా బాధపడ్డారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఐటీ, టెక్స్టైల్ వంటి పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయొచ్చని.. ప్రజా జీవనానికి హాని కలిగించే, కాలుష్య కారక కంపెనీల ఏర్పాటును అడ్డుకుంటామన్నారు. ఎకరాకు రూ.70 లక్షలు పలికే భూములను నేడు ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం తక్కువ ధరకు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ఓటు అడిగేందుకు వచ్చిన నీకు.. సమస్య తెలుసుకునే బాధ్యత లేదా..? అని సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాలు వద్దు.. భూములే కావాలి..
ప్రభుత్వ పథకాలతో ఎల్లకాలం జీవించలేము. భూములుంటేనే వ్యవసాయం చేసుకుంటూ పిల్లాపాపలతో సంతోషంగా ఉంటాం. అభివృద్ధి పేరిట మా భూములను తీసుకునేందుకు యత్నిస్తే పోరాటం చేస్తాం. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు. మా భూములను లాక్కోవాలని చూస్తే ప్రాణ త్యాగానికి సిద్ధమే.
– సోల్లానాయక్, రోటిబండతండా, దుద్యాల మండలం
బ్యాంకులో మా పొలాలకు అప్పు ఇవ్వడం లేదు..
ఫార్మా కంపెనీలను తమ భూముల్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిసి బ్యాంకులు మా భూములకు అప్పులు ఇవ్వడం లేదు. రేవంత్‌రెడ్డికి ఓట్లేసి గెలిపించడం మేము చేసిన పాపం. ఆరు నెలలుగా తిండి, నిద్రలు మాని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. ఎప్పుడు ఎవరు వచ్చి మా భూములను ఇవ్వాలని అడుగుతారోననే భయం పట్టుకున్నది. మా భూములను లాక్కొంటే మేము ఎల్లా బతకాలె.
-సుశీలాబాయి, రోటిబండ తండా, దుద్యాల మండలం
కలెక్టర్ ఆఫీసుకైనా..ఎక్కడికైనా పోయేందుకు సిద్ధమే.
మా ప్రాంతంలో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ నాయకులు మా రైతులతో ఆడుకుంటున్నారు. ఎవరు వచ్చినా భూమి ఇచ్చేది లేదు.. మా భూములను కాపాడుకునేందుకు కలెక్టర్ ఆఫీసుకే కాదు.. ఎంతవరకైనా పోయేందుకు సిద్ధం. భూములిస్తే మా పిల్లలు ఏ విధంగా బతకాలి. జీవనోపాధి పోతుంటే మా ప్రాణాలు ఉన్నా.. లేకున్నా ఒక్కటే..
-బిక్కీబాయి, రోటిబండతండా, దుద్యాల మండలం