కొడంగల్, డిసెంబర్ 24 : కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం గోఖఫస్లావాద్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధి 8 మండలాల్లోని గ్రామాలు ఆదర్శంగా మారాలంటూ ప్రతి పంచాయతీకి రూ.50 లక్షలు, మేజర్ గ్రామపంచాయతీకి రూ.కోటి నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు.
నమ్మి ఓట్లు వేసినా ప్రజలను మోసగించొద్దన్నారు. సర్పంచ్ ఎన్నికలో ్లగెలుపు అంచుల్లోకి వచ్చిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తు ఉంటుందన్నారు. మూడేళ్ల వ్యవధిలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని.. మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచమైన రాజకీయం నచ్చకపోవడంతో గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి దౌల్తాబాద్, కోస్గి, కొడంగల్, మద్దూర్ మండలాల నుంచి 160 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.