షాద్నగర్, ఫిబ్రవరి 5 : బీఆర్ఎస్ హయాంలో షాద్నగర్ మున్సిపాలిటీని ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి చేశామని.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధికంగా కౌన్సిలర్లుగా గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఓటర్లను కోరారు. గురు వారం ఆయన మున్సిపాలిటీలోని రెండోవార్డులో కౌన్సిలర్ అభ్యర్థి నర్సింహులుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో షాద్నగర్ పట్టణ ప్రజలు వేసవికాలం వచ్చిదంటే నీటి కోసం చాలా ఇబ్బంది పడేవారని, బీఆర్ఎస్ హయాంలో ఇంటింటికీ తాగునీటిని అందించి ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. ప్రతి కాలనీలోనూ సీసీ రోడ్లు, అంతర్గత కాల్వలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. షాద్నగర్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, నాయకులు నారాయణరెడ్డి, శ్రీశైలం, పలు గ్రామాల మాజీ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.