కడ్తాల్, ఏప్రిల్ 3 : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కూలగొట్టే సర్కారని.. సన్న, చిన్నకారు రైతుల భూములను బలవంతంగా, పోలీసుల సహకారంతో లాక్కోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై నిర్బంధకాండ కొనసాగుతున్నదన్నారు.
ఎవరికీ అవసరం లేని ఫ్యూచర్‌సిటీ కోసం వేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం 1100 ఎకరాలను పేదల నుంచి లాక్కోవాలనుకోవడం తగదని.. ఎవరి ఫ్యూచర్ కోసం భూములను సేకరిస్తున్నారని ప్రశ్నించారు. గురువారం మండలంలో పలు కార్యక్రమాల్లో పా ల్గొనేందుకు వచ్చిన మాజీ మంత్రికి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. మండల కేంద్రంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతిలో పాల్గొని.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మర్రిపల్లి, ఏక్వాయిపల్లి, ముద్విన్ గ్రామా ల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముద్విన్‌లో రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ్‌నాయక్ పేద కుటుంబానికి రూ.10 లక్షలతో నిర్మించిన ఇంటిని ఆయన ప్రారంభించారు. అనంతరం బోయిన్గుట్టతండాలో సంత్ సేవాలాల్ మహారాజ్, అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలను మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ్ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ఉపాధ్యక్షుడు రాంబాల్‌నాయక్, దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌తో కలిసి హరీశ్‌రావు ఆవిష్కరించారు.
అనంతరం బోయిన్గుట్టతండాలో దశరథ్‌నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి మాట్లాడుతూ.. మారుమూల తండాల్లో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, వారి విగ్రహాలను ఆవిష్కరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని..తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు విద్య, ఉద్యోగాల్లో గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు.
కానీ, కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో ఏనాడూ గిరిజనులను పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో తాగునీటి కోసం గిరిజన మహిళలు బిందెలు పట్టుకోని బావుల వద్దకు వెళ్లేవారని.. కేసీఆర్ వచ్చిన తర్వాతే మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించారని గుర్తు చేశారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని దేశంలోనే తొలిసారిగా అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
మహాత్మాగాంధీ శాంతి, అహింసా నినాదాలతో దేశానికి స్వాతంత్రం తీసుకురాగా.. ఆయన చూపిన బాటలోనే కేసీఆర్ నడిచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని.. అందువల్ల హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
కాగా, చరికొండ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు హరీశ్‌రావు, జైపాల్‌యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ జడ్పీటీసీలు విజితారెడ్డి, అనురాధ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల అధ్యక్షులు పరమేశ్, అర్జున్‌రావు, శంకర్, రాజేందర్‌యాదవ్, గ్రామాల అధ్యక్షులు రామకృష్ణ, రాజు, మాజీ సర్పంచ్‌లు యాదయ్య, భారతమ్మ, లోకేశ్‌నాయక్, భాగ్యమ్మ, హరిచంద్‌నాయక్, మాజీ ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, ప్రియ, హరీశ్ అన్న యువ సైన్యం నాయకుడు మహేశ్, అంజినాయక్, శ్రీను, రామకృష్ణ, సేవ్యానాయక్, లాయక్‌అలీ, నర్సింహగౌడ్, రమేశ్‌నాయక్, భూనాథ్నాయక్, రాములు, మల్లేశ్, మహేశ్, జంగయ్యగౌడ్, సాబేర్, నరేశ్, రాజునాయక్, శ్రీనివాస్, రవి, వెంకటేశ్, అంజి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు రక్షణ కరువు
తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యమని గొప్పగా చెప్పుకొంటున్నా మహిళలకు భద్రత కరువైంది. పంట రుణాలు మాఫీ కాక, రైతుభరోసా పెట్టుబడి సాయం సకాలంలో అర్హులకు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడువులోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అందరి దేవుళ్లపై ఒట్లు వేసి.. సగం కూడా పూర్తి చేయలేదు. తులం బంగారంతోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలి.
-సబితారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే
రాష్ట్రంలో రాక్షస పాలన..
తెలంగాణలో రాక్షస పాలన సాగుతున్నది. ఆరు గ్యారెంటీల అమల్లో ప్రభుత్వం విఫ లమైంది. ఆచరణకు సాధ్యం కానీ హామీలిచ్చి గద్దెనెక్కిన పాలకులు ప్రజలను పీడిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను కావాలనే సర్కార్ మూలన పడేసింది. ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుతో ఈ ప్రాంతంలోని చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. బహిరంగ మార్కెట్లో రూ.3 కోట్లకు ఎకరా పలికే భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవాలని చూడడం తగదు. సీఎం రేవంత్‌రెడ్డి తన బంధువులకు మేలు చేసేందుకే ట్రిఫుల్‌ఆర్ రోడ్డుకు సంబంధించిన అలైన్‌మెంట్‌ను మారుస్తున్నారు. హెచ్‌సీయూలో భూములను వేలం వేయొద్దని నిరసించిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణం. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
– జైపాల్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే, కల్వకుర్తి
కాంగ్రెస్ పాలనలో కరెంట్, కష్టాలు
కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కరెంట్, తాగు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. హామీల అమల్లో సర్కార్ ఘోరంగా విఫలమైంది. రేవంత్ సర్కార్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. అలవికాని హామీలతో గద్దెనెక్కి.. రైతులను నిలువునా ముంచుతున్నది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
– ఉప్పల వెంకటేశ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్
గిరిజనుల స్వప్నాన్నినెరవేర్చిన ఘనత కేసీఆర్‌దే..
తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కే దక్కింది. కేసీఆర్ హయాంలోనే తండాలకు బీటీ రోడ్లతోపాటు తాగునీటి కష్టాలూ తీరాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.
– దశరథ్‌నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు