హైదరాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ బుధవారం ఉదయం 7:49 గంటల ప్రాం తంలో 15,276 మెగావాట్లు. అదే రాత్రి 7 గంటలకు వచ్చేసరికి డిమాండ్ 8,994 మెగావా ట్లు మాత్రమే. అంటే ఒకే రోజులో 12 గంటల వ్యవధిలోనే డిమాండ్ 6 వేల మెగావాట్లు పడిపోయింది. ఇలా విద్యుత్తు డి మాండ్లో హెచ్చుతగ్గులు విద్యుత్తు సంస్థల అధికారులను కలవరపెడుతున్నాయి. ఒకేరోజు పీక్ డిమాండ్ నమోదుకావడం, అదే రోజులో గంటల వ్యవధిలోనే 6 వేల నుంచి 8 వేల మెగావాట్లు పడిపోవడంతో గ్రిడ్ నిర్వహణ సమస్యగా మారుతున్నది.
గ్రిడ్‌ను స మన్వయం చేసేందుకు, అధికారులు ఉరుకు లు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. భవిష్యత్‌లోనూ ఇలాగే కొనసాగే అవకాశం ఉండటం తో అధికారులు ఒత్తిడికి లోనవుతున్నారు. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్తు వినియోగం 300 మిలియన్ యూనిట్లు దాటింది. ఈ నెల 19 నుంచి ప్రతిరోజూ 300 మిలియన్ యూనిట్లు దాటుతున్నది. అకస్మాత్తుగా వర్షాలు పడటంతో మంగళవారం వినియోగం 250 మిలియన్ యూనిట్లకు తగ్గింది.