సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో చెరువుల సుందరీకరణ, పునరుజ్జీవం అంటూ కూల్చివేతల పేరుతో హల్చల్ చేసిన హైడ్రాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెరువుల పైలట్ ప్రాజెక్ట్ మొదట్లోనే ఆగిపోవడంతో షాక్ తగిలినట్లయింది. పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలనుకున్న నాలుగు చెరువుల సుందరీకరణ పనులు ప్రణాళికల దగ్గరే ఆగిపోయాయి. నగరానికి నాలుగు వైపులా 4 చెరువులను సుందరీకరించి హైడ్రా మార్క్‌ను ప్రదర్శించాలనుకున్న కమిషనర్ రంగనాథ్ ఆ చెరువుల ఊసే ఎత్తడం లేదు. హైడ్రా పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌లలో ఒక్కో చెరువును ఎంపిక చేసుకుని మొదట 4 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్ట్‌లో బాచుపల్లి-ఎర్రగుంట చెరువు, మాదాపూర్-సున్నం చెరువు, కూకట్పల్లి-నల్లచెరువు, రాజేంద్రనగర్-అప్పా చెరువులను ఎంపిక చేసింది. చెరువుల సుందరీకరణను ఆరు నెలల్లో పూర్తిచేయాలనుకున్నారు. ఇందులో భాగంగా మొదట బాచుపల్లి ఎర్రగుంట చెరువు వద్ద శిథిలాల తరలింపు విమర్శలకు దారితీయడమే కాకుండా ఖర్చుతో పాటు శిథిలాలను ఎక్కడ పోయాలన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ తర్వాత మిగతా మూడు చెరువుల విషయంలో కనీసం శిథిలాల తరలింపు కానీ ఇతర పునరుజ్జీవ పనుల మాటే వినిపించడం లేదు. ఈ నాలుగు చెరువులపై మొదట్లో దృష్టి పెట్టినప్పటికీ.. వాటి పునరుజ్జీవం, సుందరీకరణ పనులకు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేయడంతో బడ్జెట్ కారణంగా తాత్కాలికంగా ఆ పనులను ఆపేసినట్లు సమాచారం.
స్థలాల ఆక్రమణలపై దృష్టి..!
కూల్చివేతలే కాదు సుందరీకరణే తమ లక్ష్యమని ప్రకటించిన హైడ్రాకు చెరువుల పునరుద్ధరణలో అడుగడుగునా చుక్కెదురవుతున్నది. బెంగళూరు పర్యటన తర్వాత నల్లచెరువు, సున్నంచెరువు, ఎర్రగుంట చెరువు, అప్పా చెరువుల సుందరీకరణకు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ తమ బృందంతో చర్చించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని బెంగళూరు వెళ్లే ముందు అధికారులను ఆదేశించారు. స్టడీ టూర్ నుంచి రాగానే నాలుగు చెరువుల దగ్గర కూల్చివేతల అనంతరం అక్కడ ప్రతిరోజూ ఏం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి.. తమకు స్థానికులు సహకరిస్తారా.. శిథిలాల తొలగింపు తర్వాత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలానికి ఫెన్సింగ్ వేయడానికి అనుకూలంగా ఉంటుందా.. అనే అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా కమిషనర్ సమీక్ష నిర్వహించారు.
అయితే సున్నంచెరువు వద్ద కూల్చివేతల సమయంలో జరిగిన గొడవ, కోర్టు కేసులు కూడా ఉండటంతో.. ఫెన్సింగ్ వేసే వరకు ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితులను అంచనా వేయడానికి పదిహేను రోజుల పాటు చెరువుల వద్ద డ్రోన్ ద్వారా సర్వే చేశారు. మరోవైపు రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా అధికారుల బృందం అక్కడకు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఇదే సమయంలో నాలుగు చెరువులను సుందరీకరించడానికి అయ్యే ఖర్చుపై అంచనా వేసినట్లు తెలిసింది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లోని చెరువుల అభివృద్ధికి అయ్యే నిధులెంత.. అసలు ఏ మేరకు ఎలా అభివృద్ధి చేయగలమనే అంశాలపై సంబంధిత శాఖ అధికారులతో కమిషనర్ అంతర్గతంగా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత చెరువుల సుందరీకరణ ముచ్చటే పక్కకు పోయింది. ఇప్పుడంతా రోడ్లు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా దృష్టిపెడుతున్నది. ఇంతకూ పైలట్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి బడ్జెట్ లేకపోవడమే కారణమని తెలుస్తున్నది. బడ్జెట్ లేకపోవడంతో పాటు స్థానికంగా ఉన్న పరిస్థితులు, ఈ చెరువుల సుందరీకరణకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండటం కారణాలుగా హైడ్రా బృందంలో చర్చ జరుగుతున్నది.
మొదట రెండు చెరువులపైనే దృష్టి..!
పైలట్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడంతో అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, తార్నాకలోని ఎర్రకుంటలపై హైడ్రా దృష్టి పెట్టింది. ఈ రెండు చెరువులకు స్థానికుల నుంచి సహకారం అందడంతో వీటిని ఎంచుకున్నది. ఈ నేపథ్యంలో బతుకమ్మకుంటను సుందరీకరించడానికి పనులు మొదలుపెట్టింది. స్థానికంగా అనుకూలమైన వాతావరణం ఉండటం, తమ ప్రాజెక్ట్‌లో ఈ చెరువు లేకపోయినా.. ఆక్రమణలు పోను మిగిలిన ఐదెకరాల స్థలాన్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక్కడ బతుకమ్మకుంటను సుందరీకరించడానికి కావలసిన సంస్థల భాగస్వామ్యం కోరుతున్నట్లు సమాచారం. ఇందుకోసం స్థానిక కాంగ్రెస్ నేతలు వీహెచ్, రోహన్‌రెడ్డి సహకారం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది.
ఈ విషయంపై ఇప్పటికే వారితో కమిషనర్ రంగనాథ్ మాట్లాడారని, బడ్జెట్ ఇతర అంశాలపై కూడా చర్చించారని తెలిసింది. మరోవైపు తార్నాకలోని ఎర్రగుంట చెరువు అభివృద్ధికి కూడా ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో పాటు కొన్ని ఆక్రమణలు తొలగించాలని స్థానికులే కోరుతుండటంతో ఈ రెండు చెరువులపై హైడ్రా దృష్టిపెడుతున్నది. బతుకమ్మకుంట, ఎర్రగుంటలను ఎలా సుందరీకరించాలనే విషయంపై బెంగళూరు సామాజిక కార్యకర్త ఆనంద్మల్లిగవాడ్తో రంగనాథ్ చర్చించారు. బీఆర్ఎస్ హయాంలో సుందరీకరించిన రెండు చెరువులను సోమవారం సందర్శించారు. చెరువుల విస్తీర్ణాన్ని బట్టి బతుకమ్మకుంట, ఎర్రగుంట చెరువుల సుందరీకరణను వేగవంతంగా పూర్తిచేయాలనుకుంటున్నట్లు తెలిసింది. వీటి తర్వాత తక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులను ఎంపిక చేసుకుని వాటిని సుందరీకరించాలనుకుంటున్నట్లు హైడ్రా అధికారి ఒకరు చెప్పారు.