కేశంపేట, జూలై 30 : కబ్జాకు కాదేది అనర్హం అనే విధంగా తయారైంది కేశంపేట మండలంలో ప్రస్తుత పరిస్థితి. చెరువులు, కుంటలు, పాటుకాలువలపై కన్నేసిన అక్రమార్కులు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ దర్జాగా ఫెన్సింగ్, ప్రీకాస్ట్ను వేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తుండడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. 50 ఎకరాల ఆయకట్టుగల చెరువులోకి నీటి ప్రవాహం వెళ్లకుండా అడ్డుకున్నవారిపై చర్యలు తీసుకోవడంతోపాటు దత్తాయపల్లి గ్రామంలోని సర్వే నం.27లో ధ్వంసమైన పాటుకాలువను అధికారులు పునరుద్ధరించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
కేశంపేట మండలంలోని దత్తాయపల్లి సర్వే నం.27లో పాటుకాలువను కొందరు ధ్వంసం చేయడంతో గ్రామంలోని గొల్లవాని చెరువుకు నీటి ప్రవాహం నిలిచిపోయిందని రైతులు చెబుతున్నారు. వర్షాలు పడితే పుట్టవానిగూడ నుంచి నీటి ప్రవాహం మందడి అంజయ్య, మామిడిపల్లి పెద్ద రాములు, వలికె వెంకటేశ్, మందడి అంజయ్య, జంగిడి ప్రవీణ్‌రెడ్డి, జంగిడి రాంరెడ్డికి సంబంధించిన వ్యవసాయ పొలాలను తాకుతూ నీటి ప్రవాహం గొల్లవాని చెరువులోకి చేరుకుంటుందని తెలిపారు. పాటుకాలువను ధ్వంసం చేయడంతో చెరువులోకి నీరు వచ్చే అవకాశాలు లేవని, గొల్లవాని చెరువు కింద దాదాపు 50 ఎకరాల్లో ఆయకట్టు సాగు ఉందని, పాటుకాలువ ధ్వంసంతో చెరువుకట్ట కింద సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దత్తాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత అండదండలతోనే పాటుకాలువను ధ్వంసం చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
మండల పరిధిలోని లింగంధన గ్రామంలోని సర్వే నం.55లో పాటుకాలువను ధ్వంసం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆఘమేఘాల మీద స్పందించిన అధికారులు పోలీసుల పహరా మధ్య జూన్ 25న ఘటనా స్థలానికి ఇరిగేషన్ ఏఈఈ ఫసీహా చేరుకొని దాదాపు 60 మీటర్ల వరకు పాటుకాలువను పునరుద్ధరించారు.
ఈ విషయమై అప్పట్లో బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత మహిళలు కుమ్మరి రంగమ్మ, పద్మమ్మ మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రామచంద్రి, యాదమ్మ వద్ద ఒక గుంటకు రూ.2లక్షల చొప్పున మొత్తం 6 గుంటల భూమిని కొనుగోలు చేశామని, అధికార పార్టీకి చెందిన నేతల రాజకీయ కుట్రలో భాగంగానే తాము కొనుగోలు చేసిన భూమిలో తవ్వకాలు జరిపారంటూ అప్పట్లో కన్నీటిపర్యంతమయ్యారు.
లింగంధనలో అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడితో పాటుకాలువను పునరుద్ధరించిన అధికారులు.. అదే అధికార పార్టీకి చెందిన నేతల అండదండలతో దత్తాయపల్లిలో పాటుకాలువను ధ్వంసం చేస్తే పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు స్పందించి దత్తాయపల్లిలో కబ్జాకు గురైన పాటుకాలువను పునరుద్ధరించాలని సమీప వ్యవసాయ పొలాల రైతులు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
మాది నిరుపేద కుటుంబం. ఇంటి పెద్దదిక్కులేదు. మహిళలమైన మేము పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి గుంటకు రూ.2లక్షలు చెల్లించి 6 గుంటల భూమిని కొనుగోలు చేశాం. గతంలో ఎన్నడూ అక్కడ పాటు కాలువ ఉన్నది మేము చూడలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు కుట్రపూరితంగా గుంతను తీయించారు.
– రంగమ్మ, మహిళా రైతు, లింగంధన, కేశంపేట