వికారాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తాండూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి కాగ్నా ఉగ్రరూపం దాల్చింది. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని పలు గ్రామాలను వరద ముంచెత్తింది. తాండూరు మండలంలోని వీరశెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధమైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కాగ్నా వరద నీరు గ్రామాన్ని చుట్టుముట్టడంతో అప్రమత్తమైన గ్రామస్తులు వీరశెట్టిపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద బిక్కుబిక్కుమంటూ గడిపారు.
బషీరాబాద్ మండలంలోని జీవన్గీ, నవాంద్గీ, గంగ్వార్ గ్రామాల్లో వరద నీరు ఇండ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెద్దేముల్ మండలంలోని ఇందూరు గ్రామాన్ని వరద నీరు ముంచెత్తడంతో శుక్రవారం రాత్రి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురిస్తే ప్రతీసారి వరద వస్తున్నా తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడంలేదంటూ బ్రిడ్జి నిర్మించాలంటూ గ్రామస్తులు రెండు, మూడు గంటలపాటు రోడ్డుకు అడ్డంగా ఎద్దుల బండి పెట్టి ఆందోళన చేపట్టగా, పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.
మరోవైపు తాండూరు-కర్నాటకకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బంట్వారం మండలంలోని సుల్తాన్పూర్, తోర్మామిడి, యాచారం గ్రామాల్లో భారీ వర్షానికి వరద నీరు ఇండ్లలోకి చేరింది. మర్పల్లి మండలంలోని కల్కోడ గ్రామం భారీ వర్షానికి జలదిగ్బంధమైంది. దీంతో రెండు రోజులుగా విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. బంట్వారం మండలం కొత్తపల్లి చెరువు వద్ద బైక్‌పై అలుగును దాటుతుండగా అదుపుతప్పి వరద నీటిలో కొట్టుకుపోయి ఒకరు మృతిచెందారు. బషీరాబాద్ మండలం జీవన్గీ శివారులోని గోశాలలోని 140 ఆవులు మృత్యువాతపడ్డాయి.
జీవన్గీలోని శివాలయం నీట మునిగింది. వికారాబాద్ మండలంతోపాటు నవాబుపేట్ మండలంలోని చించల్పేట్, గంగ్యాడ వద్ద మూసీ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహించింది. కోట్‌పల్లి, జుంటుపల్లి, సర్పన్‌పల్లి, శివసాగర్ ప్రాజెక్టులతోపాటు చెరువులన్నీ నిండడంతోపాటు అలుగుపారుతున్నాయి. కాగ్నా వరద ధాటికి కోకట్ బ్రిడ్జి కొట్టుకుపోగా, జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మించిన రెండు పిల్లర్లు వరద ఉధృతికి కుంగిపోయాయి. తాండూరు నియోజకవర్గంతోపాటు బంట్వారం, నవాబుపేట్, మర్పల్లి, మోమిన్‌పేట్ మండలాల్లోని గ్రామాలకు వెళ్లే రోడ్లు వరద నీటికి కొట్టుపోయాయి.
యాలాల మండలం ముకుందాపూర్‌లో, ధారూరు మండలంలో వర్షానికి ఇండ్లు నేలకూలాయి. భారీ వర్షానికి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి, పసుపు, మినుములు, పెసర, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మర్పల్లి మండలంలోని రావులపల్లిలోనే 500 ఎకరాలకుపైగా పత్తి తదితర పంటలు వరద నీటికి కొట్టుకుపోయాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జిల్లావ్యాప్తంగా 67.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
మర్పల్లి : అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం అందివ్వాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మండలంలోని రావులపల్లి గ్రామంలో శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న పంటలు, కొట్టుకుపోయిన రోడ్డు, కల్వర్టులను శనివారం ఆయన సందర్శించి పరిశీలించారు.
వర్షాలకు పంటలు నీట మునిగి తీవ్ర నష్టం జరిగిందని, వరద ఉధృతికి రోడ్లు జలమయం కావడంతో కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించిందన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయించడంతోపాటు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్, రైతులు పాల్గొన్నారు.