Rangareddy | రంగారెడ్డి, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు అనుకూలించక చెరువులు పూర్తిగా ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ కింద జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. అలాగే చెరువులకు నీరందించే ప్రధాన కాల్వలను కూడా మరమ్మతు చేసినందున గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండాయి. ఆ తర్వాత ఆశించిన మేరకు వర్షాలు కురియకపోవటం వల్ల చెరువులు, కుంటలకు నీరురాక ఎండుముఖం పట్టాయి.
గత సంవత్సరమే చెరువులు, కుంటల్లో నీరు లేకపోవటం వల్ల కేవలం 50 శాతం చేప పిల్లలు మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 1.20 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం 59 లక్షల చేప పిల్లలను పంపిణీ చేసింది. ఈ ఏడాది చెరువుల్లో నీరు లేకపోవటం వలన వాటిని కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు మత్స్య శాఖకు నిధుల కొరత కూడా తీవ్రంగా ఉండటం వలన ఈ సంవత్సరం చేపపిల్లలను పంపిణీ చేసే అవకాశాలు లేనట్లేనని తెలిసింది. చెరువులు ఎండిపోవటంతో చెరువులపైనే ఆధారపడిన మత్స్యకారులు ఉపాధికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 196 సొసైటీల్లో సుమారు 10వేల మందికి పైగా సభ్యులున్నారు. చెరువులపై ఆధారపడి మత్స్యకార కుటుంబాలు లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారు. కాని, చెరువులు ఎండిపోవటంతో వీరి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుంది.
జిల్లా వ్యాప్తంగా 982చెరువులు
రంగారెడ్డి జిల్లాలో 982 చెరువులు ఉన్నాయి. వీటిలో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు, మహేశ్వరం మండలంలోని రావిర్యాల చెరువు, యాచారం మండలంలోని లక్ష్మణ్ చెరువు, తుర్కయంజాల్లోని మాసబ్చెరువు, మంచాల మండలంలోని లింగంపల్లి గ్రామంలోని సాబిత్నగర్ చెరువుతో పాటు మరో పది పెద్దచెరువులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు నీరు మాత్రమే నిల్వ ఉంది. మిగతా చెరువుల్లో 80 శాతానికి పైగా ఎండిపోయాయి. చెరువులు ఎండిపోవటంతో చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్న మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు చెరువుల్లో 60శాతం నీరుంటేనే చేప పిల్లలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాని, ప్రస్తుతం జిల్లాలో ఉన్న రావిర్యాల, ఇబ్రహీంపట్నం, మాసాబ్చెరువు వంటి వాటిలో కూడా 60 శాతం నీళ్లు లేవు. వీటికి కూడా చేపపిల్లలను ఇచ్చే అవకాశాలు లేవనే చెబుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులన్ని నిండుకుండల్లా ఉండటంతో అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున చేప పిల్లలను పంపిణీ చేసింది. ఏ గ్రామంలో చూసినా చేపలు రావులు పోసి అమ్మేవారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులకు నీరురాకపోవటంతో చేపపిల్లలు కూడా ఇచ్చే అవకాశాలు లేవని చెబుతుండటంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి గ్రామాలకు చేపలను తీసుకువచ్చి మత్స్యకార కుటుంబాలు విక్రయించేవి. కాని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో పెంచిన చేపలను హైదరాబాద్ తీసుకెళ్లి విక్రయించేవారు. కాని, చెరువులు ఎండిపోవటంతో మల్లీ హైదరాబాద్ నుంచి గ్రామాలకు చేపలు తీసుకువచ్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మూతపడిన చేపపిల్లల పెంపకం కేంద్రం
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సమీపంలో గతంలో చేపపిల్లల పెంపక కేంద్రం ఉండేది. ఇక్కడే చేపపిల్లలను పెంచి జిల్లావ్యాప్తంగా చెరువులకు సరఫరా చేసేవారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపపిల్లల పెంపక కేంద్రం పూర్తిగా మూతపడింది. చేపపిల్లల పెంపకం కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్లు పూర్తిగా ఎండిపోయాయి. జిల్లావ్యాప్తంగా ఇబ్రహీంపట్నంలో ఒకేఒక్క చేపపిల్లల పెంపక కేంద్రం ఉండేది. ఈ పెంపక కేంద్రంలో చేపపిల్లలు పెంచడంతో పాటు మత్స్యకార సహకార సంఘాల వారికి శిక్షణ కూడా ఇచ్చేది.
ప్రస్తుత ప్రభుత్వంలో నిధుల కొరత కారణంగా చేపపిల్లల పెంపక కేంద్రం మూతపడింది. శిక్షణ కూడా ఇవ్వటంలేదు. దీంతో ఇబ్రహీంపట్నంలోని చేపపిల్లల పెంపక కేంద్రం పూర్తిగా మూతపడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నంలోని చేపపిల్లల పెంపక కేంద్రం వద్ద ఫిష్మార్కెట్ ఏర్పాటు కోసం రూ.2కోట్లను కూడా మంజూరు చేసింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నుంచి చేపలు పట్టుకుని మత్స్యకారులు ఇక్కడ అమ్ముకునేందుకు వీలుగా ఈ మార్కెట్ ఏర్పాటుకు పునాది వేశారు. కాని, రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో చేపల మార్కెట్ ఊసే ఎత్తటంలేదు. చేపల మార్కెట్ కోసం కేటాయించిన నిధులు కూడా ఇతర వాటిని దారిమళ్లించినట్లు ఆరోపణలున్నాయి.