రంగారెడ్డి, జూలై 29(నమస్తే తెలంగాణ) ;‘ఊర్లలోని ప్రతి ఇంటా.. చేపల ఘుమఘుమలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఏటా జలకళను సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వమే ప్రతిసారి ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ చెరువులు, కుంటల్లో వదులుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లగా.. చెరువులు అలుగు దుంకుతున్నాయి. దీంతో వరద ఉధృతితోపాటు వస్తున్న చేపలు పంట పొలాలు, రోడ్లపై దర్శనమిస్తున్నాయి. చిన్న, చిన్న కాలువలకు సైతం వచ్చి చేరాయి. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా చేపల వేట కనిపిస్తున్నది. ఊరూరా మత్స్య సంపద ఉట్టిపడుతున్నది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఉన్న ఊర్లోనే పుష్కలంగా చేపలు దొరుకుతున్నాయి. లైవ్ చేపలు ఎంతో రుచికరంగా ఉంటుండడంతో చికెన్, మటన్‌కు ప్రత్యామ్నాయంగా మారి ‘సండే’ స్పెషల్ వంటకంలో చేపల కూర తప్పనిసరిగా మారింది. కొనుగోళ్లతో చేపల మార్కెట్ల్లూ కిటకిటలాడుతున్నాయి. తక్కువ ధరకే తాజా చేపలు లభిస్తుండడంతో ప్రజలు వివిధ వంటకాలు చేసుకొని ఆరగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 684 చెరువుల్లో చేప పిల్లలను ప్రభుత్వం వదులుతూ వస్తున్నది. గతేడాదిలో రూ.1.17కోట్లు వెచ్చించి 1.63కోట్ల చేప పిల్లలను వదిలింది.
ప్రభుత్వ కార్యదీక్షత సిద్ధించింది.. మిషన్ కాకతీయ సంకల్పం ఫలించింది. చెరువులు, కుంటలన్నీ చేపలతో కళకళలాడుతున్నాయి. ఊరూరా ఎటు చూసిన మత్స్య సంపద ఉట్టిపడుతోంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఉన్న ఊర్లోనే పుష్కలంగా చేపలు దొరుకుతున్నాయి. లైవ్ చేపలు ఎంతో రుచికరంగా ఉంటుండడంతో చికెన్, మటన్‌కు ప్రత్యామ్నాయంగా మారి ‘సండే’ స్పెషల్ వంటకంలో చేపల కూర తప్పనిసరిగా మారింది. ప్రస్తుత వర్షాలకు చెరువుల్లోని చేపలు ఎదురెక్కుతున్నాయి. వరదతోపాటు కొట్టుకువచ్చి పంట పొలాలు, రోడ్లపైకీ చేరుతున్నాయి. ఫలితంగా ప్రస్తుతం ఎక్కడచూసినా చేపల వేట ముమ్మరంగా సాగుతున్నది. కొనుగోళ్లతో చేపల మార్కెట్లు సైతం కిటకిటలాడుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏడేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అటు మత్స్యకార్మిక కుటుంబాలకు ఉపాధి చూపడంతోపాటు ప్రజానీకానికి చేపల కొరతను తీర్చింది.
ఒకప్పుడు ‘చేపల చెరువు’ అంటే ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. ‘చేపల చెరువు’ అనే పదమే తెలంగాణకు కొత్తగా అనిపించేది. కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు ఏ కుంట, చెరువును చూసినా.. చేపల చెరువే గుర్తుకొస్తుంది. ఇటీవల రంగారెడ్డి జిల్లాలోనూ పుష్కలంగా వర్షాలు పడ్డాయి. మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన పనులతో చెరువులన్నీ బాగుపడ్డాయి. ప్రస్తుత వర్షాలకు జిల్లాలో ఉన్న 2,083 చెరువులన్నింటిలోకి సమృద్ధిగా నీరు వచ్చి చేరింది. అందులో 203కు పైగా చెరువులు అలుగుపోస్తున్నాయి. చెరువుల్లోని చేపలు చిందేస్తున్నాయి. చెరువుల నుంచి వచ్చే వరదతోపాటు చేపలు కొట్టుకువస్తుండడంతో ప్రజలు చేపల కోసం ఎగపడుతున్నారు. గాలం వేసి చేపలు పడుతున్నారు. కొందరు రైతులు సైతం పంట పొలాల్లో చేపల చెరువులను ఏర్పాటు చేసుకుని చేపల పెంపకాన్ని చేపడుతున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాలో చేపలకు కొరత అనేదే లేకుండా పోయింది. ఒకప్పుడు చేపల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ అత్యధిక రేటుకు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ప్రతి ఊర్లోనూ తాజా చేపలు దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఒకట్రెండు రకాల చేపలు దొరకడమే గగనం కాగా.. నేడు రకరకాల చేపలు ప్రజానీకానికి అందుబాటులో దొరుకుతున్నాయి. మత్స్యశాఖ సైతం ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పేరుతో చేపలు, రొయ్యలతో తయారు చేసిన బిర్యానీ, పులుసు, ఫ్రై, అపోలో ఫిష్, పకోడి, బంతులు, మిఠాయి వంటి భిన్న రుచులను ప్రజలకు పరిచయం చేస్తోంది. ఈ చర్యల ఫలితంగానూ మాంసం ప్రియులను చేపల వంటకం వైపుగా మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం చేపల కూర ‘సండే’ స్పెషల్ వంటకంగా మారింది.
జిల్లాలో ఏటా 10వేల టన్నుల చేపల ఉత్పత్తి..
జిల్లాలోని 120 మైనర్ ఇరిగేషన్ చెరువులు, 684 మత్స్యశాఖకు సంబంధించిన చెరువుల్లో చేప పిల్లలను ప్రభుత్వం ఉచితంగా వదిలి చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. 2016 సంవత్సరంలో 10లక్షల చేపపిల్లలతో మొదలైన పంపిణీ కార్యక్రమం 2022 సంవత్సరం నాటికి 1.63కోట్ల చేప పిల్లల పంపిణీ స్థాయికి చేరింది. గత యేడాది రూ.1.17కోట్ల రూపాయలను వెచ్చించి వదిలిన చేప పిల్లలతో 9,273 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి అవుతున్నది. చేపల వ్యాపారంతో వివిధ వర్గాలకు రూ.138కోట్ల ఆదాయం సమకూరుతున్నది. మత్స్య సంపదను పెంచే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మత్స్యకార్మిక కుటుంబాలను సైతం ఇతోధికంగా ఆదుకుంటున్నది. జిల్లాలో ఉన్న 161 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల పరిధిలోని 8,221 మందికి వివిధ రూపాల్లో ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తున్నది. చేపలను ఉచితంగా అందజేయడంతోపాటు చేపలను విక్రయించుకునేందుకు త్రీ, ఫోర్ వీలర్ వాహనాలను సబ్సిడీపై అందిస్తున్నది. చేపలను విక్రయానికి సంబంధించిన స్టాల్స్‌ను సమకూర్చడంతోపాటు చేపల వంటకాలపై మత్స్యకార్మిక కుటుంబాల్లోని మహిళలకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తున్నది.
చేపలు కిలో రూ.150 వరకు విక్రయిస్తున్నాం..
వానకాలం సీజన్లో చేపలకు మంచి గిరాకీ ఉన్నది. చందనవెళ్లి పెద్ద చెరువులో నెల రోజుల నుంచి చేపలను పడుతున్నాం. చేపలు కిలో రూ.150 వరకు విక్రయిస్తున్నాం. షాబాద్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వచ్చి చేపలు కొనుగోలు చేస్తున్నారు. భారీ వర్షాలకు చెరువు నిండి అలుగు పారడంతో పెద్ద ఎత్తున చేపలు దొరుకుతున్నాయి. పొద్దున్న లేచింది మొదలు, సాయంత్రం వరకు చేతినిండా పని దొరుకుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అందించిన చేయూత వల్ల చేపల ఉత్పత్తి పెరిగింది. దీంతో మత్స్యకారులకు లాభాలు వస్తుండడంతో సంతోషంగా ఉన్నది. ఇదివరకు పనిలేక నానా ఇబ్బందులు పడ్డాం. బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మాకు భరోసా వచ్చింది. ఉచిత చేపపిల్లల పంపిణీ, సామగ్రిని ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్నది.
– నర్సింహులు, మత్స్యకారుడు, చందనవెళ్లి(షాబాద్)
‘మిషన్ కాకతీయ’తో మత్స్యకారులకు ఉపాధి..
మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల పునరుద్ధరణ జరిగింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు చేపల వేటకు కావాల్సిన సామగ్రిని సబ్సిడీపై అందజేసింది. వలలు, ద్విచక్ర వాహనాలు తదితర వాటిని అందించి మాలో ధైర్యాన్ని నింపింది. వర్షాలు సమృద్ధిగా కురియడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో వేసిన చేపలు పెరిగాయి. దీంతో మత్స్యకారులకు చేతినిండా పని దొరుకుతున్నది. ఏ పల్లెకెళ్లినా ఆ పల్లెలోని చెరువులో చేపలు పుష్కలంగా ఉన్నాయి. పల్లె జనం తినేందుకు చేపలు సరిపోగా, పట్టణాలకు తీసుకొచ్చి విక్రయిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి. అంతకుముందు ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపోలే.
– గుండు సురేశ్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గూడూరు, కొత్తూరు మండలం
సీఎం కేసీఆర్.. మాపాలిట దేవుడు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చేపలు పట్టే వృత్తి వదిలేసి వేరే పని చేసుకునేది. రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మాంది. వర్షపు నీటిని నిలువచేసేందుకు చెరువుల మరమ్మతులు జోరుగా జరిగాయి. ప్రతి నీటి చుక్కను నిలువ చేసేలా చెరువులను అభివృద్ధి చేశారు. దీనివల్ల చెరువుల్లో ఏ కాలంలో చూపినా నిండుగా నీళ్లే. దీంతోపాటు చేప పిల్లలను కూడా ఉచితంగా అందిస్తున్నారు. దీనివల్ల తిరిగి చేపలు పట్టే వృత్తిని చేపట్టాం. ఇప్పుడు చేతి నిండా పని దొరుకుతున్నది. చేపల ఉత్పత్తి పుష్కలంగా ఉండడంతో లాభాలను ఆర్జిస్తున్నాం. మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనందిస్తున్న సీఎం కేసీఆర్.. మాపాలిట దేవుడు.. ఎప్పటికీ సీఎం వెంటే ఉంటాం.
– నీరటి మహేశ్, మత్స్యకారుడు, గూడూరు
సీఎం కేసీఆర్ బెస్తోళ్లకు బతుకుదెరువిచ్చిండు..
సీఎం కేసీఆర్ సార్ మా బెస్తోళ్లకు బతుకుదెరువిచ్చిండు. గతంలో చెరువులు, కుంటల్లో నీళ్లులేక గడ్డు కాలం వెళ్లదీశాం. తెలంగాణ వచ్చాక చెరువులకు మరమ్మతులు చేయడం, వర్షాలు బాగా పడడం, ఉచితంగా చేప పిల్లలను ఇవ్వడంతో ఉపాధికి కొదువలేకుండా పోయింది. సురంగల్ చెరువులో రెండు సార్లు చేప పిల్లలను వేశాం. ప్రభుత్వం ఉచితంగా 12 వేల చేప పిల్లలను ఇచ్చింది. చెరువులో 8 సార్లు చేపలు పట్టాం. సుమారుగా 8 క్వింటాళ్ల వరకు చేపల దిగుబడి వచ్చింది. ఈ చెరువులో చేపలు వేయడం వల్ల సుమారు 50 మందికి ఉపాధి లభించగా, రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– కరుణాకర్, వెంకటాపూర్, మొయినాబాద్
చేపలకు ఫుల్ గిరాకీ..
ఈ ఏడాది చేపలకు మంచి గిరాకీ ఉన్నది. చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మంది చేపల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. చేపలు తీసుకుని మార్కెట్‌కు రాగానే, గంటలోపే చేపలు పూర్తిగా అమ్ముడుపోతున్నాయి. చేపల ధరలు తక్కువగా ఉండటమే కాకుండా ప్రాణంతో ఉన్న చేపలను విక్రయిస్తున్నారు. చెరువుల్లో చేపలు ఎక్కువగా ఉండటం వల్ల మత్స్యకారులు ఎక్కువమంది చేపలను మాకు విక్రయిస్తున్నారు.
– దేవలక్ష్మీ, చేపల విక్రయందారి ఇబ్రహీంపట్నం