కేశంపేట, జూలై 20 : ఫర్టిలైజర్ దుకాణదారులు సిండికేటుగా ఏర్పడి రైతన్నలను నట్టేట ముంచుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో రైతులు పంటలను అత్యధికంగా సాగు చేయడాన్ని ఆసరాగా చేసుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల ఫర్టిలైజర్ దుకాణదారులు సీడ్స్, రసాయన ఎరువులు, మందులతోపాటు పిచ్చికారి చేసేందుకు వస్తున్న బూమ్ స్ప్రేయర్ (సన్న పయ్యల ట్రాక్టర్) ధరను అమాంతం పెంచి అందినకాడికి దండుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫెర్టిలైజర్స్ దుకాణదారులు ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందని మండల రైతులు వాపోతున్నారు.
తమ అవసరాన్ని అవకాశంగా తీసుకున్న ఫెర్టిలైజర్ వ్యాపారులు రెండింతల డబ్బులను వసూళ్లు చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే నిస్సిగ్గుగా బూతులకు పని చెబుతూ రైతులను తూలనాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ దుకాణదారుడు రైతును బూతు మాటలు తిట్టడంతో ఆగ్రహించిన రైతన్నలు మండల కేంద్రంలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమ దుకాణంలోని ఎరువు, రసాయన మందులకు సంబంధించిన ధరలను తమ ఇష్టానుసారం నిర్ణయించుకుంటామని, మేము చెప్పే రేట్లు నచ్చకపోతే దుకాణం పరిసరాల నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తూ మానసికంగా హింసిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఫర్టిలైజర్ దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి రైతులు మోసపోకుండా కాపాడాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు.
ఎరువుల పిచ్చికారికి విచ్చలవిడి వసూళ్లు
కేశంపేట మండలంలో ఆయా పంటలను సాగు చేసిన రైతులు మందులు పిచికారి కోసం ఫర్టిలైజర్స్ దుకాణదారులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే సిండికేటుగా ఏర్పడిన దుకాణదారులు ఓ ధరను ఫిక్స్ చేసుకొని తమ వద్దకు వచ్చే రైతులకు ఆ ధరను చెబుతున్నారు. అయితే రైతుకు నచ్చిన మందులు పిచికారి చేసేందుకు ఫర్టిలైజర్ దుకాణదారుడు ఒప్పుకోవడంలేదు. దుకాణదారుడి వద్ద అందుబాటులో ఉన్న అధిక ధరల మందును రైతుకు చూపెట్టి దానినే పిచికారి చేయాలని, అలా చేస్తేనే తన బూమ్ స్ప్రేయర్‌ను పంపిస్తానని తెగేసి చెబుతున్నారు. బూమ్ స్ప్రేయర్‌తో ఒక ట్యాంకు నీటిని పిచ్చికారి చేసేందుకు మందులతో కలిసి రూ.10వేలు వసూలు చేస్తున్నారని, దానికి అదనంగా మరో రూ.300 ట్రాక్టర్ కిరాయి అని చెప్పి తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ఫర్టిలైజర్ దుకాణదారుడు పత్తి, మొక్కజొన్న పంటకు మందును పిచ్చికారి చేసేందుకు ఎకరానికి రూ.10వేల వరకు వసూళ్లు చేస్తున్నారని, దుకాణదారుడు ఇచ్చిన మందులు కాకుండా రైతుకు నచ్చిన మందులు కొనుగోలు చేస్తే ఎకరానికి రూ.4వేల వరకు ఆదా అవుతుందని రైతులు చెబుతున్నారు. రైతులకు నచ్చిన మందులు పిచికారి చేసుకునేందుకు దుకాణదారుడు అనుమతించండని, దుకాణదారుడి ఇష్టానుసారంగానే మందును పిచికారి చేయాల్సి ఉంటుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందించి అత్యధికంగా వసూళ్లు చేస్తున్న ఫెర్టిలైజర్స్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నకిలీ రశీదులతో దందా..
కేశంపేట మండల కేంద్రంలోని పలువురు ఫెర్టిలైజర్ దుకాణదారులు తమ దుకాణాలకు సంబంధించి ముద్రించిన రశీదుల్లో సీల్, దుకాణదారుడి సంతకాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నామమాత్రంగా దుకాణం పేరు ముద్రించిన రశీదును కంప్యూటర్ నుంచి ప్రింట్ తీసి రైతులకు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని శ్రీనివాసా’స్ నాగలి’ దుకాణం వద్దకు ఎరువులు కొనుగోలు చేసి బూమ్ స్ప్రేయర్స్‌తో పిచికారి చేసేందుకు వెళ్లి ధరను మాట్లాడితే దుకాణదారుడు ధర ఎక్కువగా చెప్పాడని, ఈ విషయమై ఇదేమని అడగగా తన దుకాణం తన ఇష్టమంటూ రైతును బూతు మాటలు తిట్టాడని ఆరోపించారు. ఈ విషయమై ఆగ్రహించిన రైతన్నలు మండల కేంద్రంలో ఆందోళనకు దిగడంతో వ్యవసాయశాఖ అధికారిణి శిరీష, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళన కారులను సముదాయించారు. అయితే ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు రైతులు ఏవోకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఫెర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీ చేసి రశీదులు ఇవ్వడంతోపాటు రైతులతో మర్యాదగా ప్రవర్తించేలా చూడాలని మండల రైతులు అభిప్రాయపడుతున్నారు.