ఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేసే రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, నకిలీ విత్తనాలు ఇలా ఏదో రకంగా అన్నదాత నష్టపోతూనే ఉన్నాడు. ప్రకృతి కన్నెర్ర చేసి పెట్టిన పెట్టుబడి వరద ధాటికి కొట్టుకుపోయినా అధైర్యపడకుండా ముందుకే సాగుతున్నాడు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సాగుపై కొందరికి ఆశలు సన్నగిల్లుతున్నా.. మరికొందరు మాత్రం అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగింది. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10,000 చొప్పున పరిహారం అందజేస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ఇప్పటికీ ఏ ఒక్క రైతుకు కూడా నయా పైసా అందకపోవడం గమనార్హం.
– వికారాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ)
అప్పులు చేసి పంటలను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లిస్తే వారికి కొంతవరకైనా ఉపశమనం లభించేది. ఆ మూడు నెలల్లో జరిగిన నష్టానికి సంబంధించి పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి పంపించి దాదాపుగా ఎడాది అవుతున్నా రై తులకు పరిహారమే అందలేదు. కాంగ్రెస్ స ర్కార్ పరిహారం పంపిణీలో జాప్యం చేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
జిల్లాలో గతేడాది కురిసిన భారీ వర్షాలకు అపార పంటనష్టం జరిగింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో కాగ్నా, మూసీ ఉప్పొంగి ప్రవహించడంతోపాటు వరద ధాటికి పలు మండలాల్లో పంటలు కొట్టుకుపోయాయి. రైతులు పత్తి ఏరేందుకు సిద్ధమైన సమయంలో అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో పత్తి పంట వరదలో నీట మునిగింది. పత్తి రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. జిల్లాలో దాదాపుగా 5,046 ఎకరాల్లో ఆయా పంటలకు నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. ఎక్కువగా పెద్దేముల్, వికారాబాద్, దౌల్తాబాద్, కోట్‌పల్లి, మర్పల్లి, తాండూరు, ధారూరు, పూడూరు, పరిగి, నవాబుపేట మండలాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు లెక్క తేల్చారు.
నష్టపోయిన పంటల్లో ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయల ఉన్నాయి. జిల్లాలో భారీ వర్షాలతో 4,251 మంది రైతులు తమ పంటలను సుమారు 355 గ్రామాల్లో నష్టపోయినట్టు గుర్తించారు. గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో 1,430 మంది రైతులకు చెందిన 1536 ఎకరాల పంటలు నష్టపోగా, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు 2,821 మంది రైతులకు చెందిన 3510 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయితే ఎకరాకు రూ.10 వేల చొప్పున ఆగస్టులో నష్టపోయిన పంటలకు రూ.1.53 కోట్లు, సెప్టెంబర్, అక్టోబర్లలో నష్టపోయిన పంటలకు రూ.3.51 కోట్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నది. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలోని పరిగి, దోమ, తాండూ రు, వికారాబాద్, మోమిన్‌పేట, నవాబుపేట, పూడూరు, చౌడాపూర్, కులకచర్ల మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు పంటలను నష్టపోయారు.