షాబాద్, మే 21: యాసంగి సీజన్ పూర్తయి, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావొస్తున్నా రైతుకు మాత్రం పంట పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ నెల చివరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావోస్తున్నా యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా సాయం పూర్తి స్థాయిలో అందకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పంటలకు కలిపి రూ.10వేల పంటపెట్టుబడి సాయం అందించగా, కాంగ్రెస్ వచ్చినంకా రూ.15వేలు ఇస్తామని ప్రకటించి తీరా చూస్తే రూ.12వేలకు తగ్గించింది. అది కూడా అరకొరగా అందించడంతో తమకు ఏ మాత్రం సరిపోవడం లేదని, అదునుకు డబ్బులు అందక అప్పులు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్ రైతుభరోసా సాయంపై అన్నదాతలు కన్నెర్ర చేయడంతో గందరగోళంలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి నెలలో మొదటి విడతగా ఎకరం లోపు ఉన్న రైతులకు డబ్బులు జమ చేసింది. రెండో విడత ఆలస్యం కావడంతో జగిత్యాలలో కేసీఆర్ సభతో ఏప్రిల్‌లో రెండో విడత డబ్బులు జమ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం మూడో విడత సాయం అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు విడతల్లో రైతుభరోసా అందిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి… రంగారెడ్డిజిల్లాలో తొలి విడత, రెండో విడతలో కలిపి మొత్తం 2,96,899 మంది రైతుల ఖాతాల్లో రూ.217.41కోట్లు డబ్బులు అందజేసింది. కొంతమంది రైతులకు ఎకరం వరకే డబ్బులు పడ్డాయని చెబుతున్నారు. గత నెలలోనే మూడో విడత డబ్బులు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. యాసంగి సీజన్ ముగుస్తున్నా ఇప్పటివరకు మిగతా విడతల సాయం అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 21 మండలాలున్నాయి. పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే భరోసా అందిస్తామని చెప్పిన ప్రభుత్వం…10 నుంచి 20 ఎకరాల వరకు పంటలు సాగు చేస్తున్న రైతులకు కూడా రెండెకరాల వరకు మాత్రమే డబ్బులు అందజేసి చేతులు దులుపుకున్నది. విడతల వారీగా సాయం అందిస్తే మాకు ఎలా ఉపయోగపడుతుందని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి 24గంటల కరెంట్ అందించి అన్నదాల కష్టాలు తీర్చారు. పంటకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రెండు పంటలకు అదునుకు ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి సాయం సకాలంలో అందడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుని జీవనం సాగించారు. మొత్తం 13 విడతల్లో రైతులకు పంటపెట్టుబడి సాయం అందించి కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారు. కానీ కాంగ్రెస్ హయాంలో అందుకు విరుద్ధంగా కొనసాగుతుంది. రెండు, మూడు విడతల్లో పంటపెట్టుబడి సాయం అందిస్తామని ఇప్పటి ప్రభుత్వం చెబుతుంటే రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు ముందే యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్ రైతుభరోసా డబ్బులు అందించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఎకరం నుంచి రెండెకరాల వరకే రైతుభరోసా డబ్బులు అందిస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి రూ.15వేలు అందిస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.12వేలకు తగ్గించారు. అది కూడా సకాలంలో ఇవ్వడం లేదు. అప్పులు చేసి పంటలు సాగు చేసుకుంటున్నాం.
– మ్యాగూడెం హన్మంతు, రైతు కుమ్మరిగూడ (షాబాద్)
కేసీఆర్ హయాంలో రైతుబంధు డబ్బులు అదునుకు వచ్చేవి. వానకాలం, ఎండకాలం రెండు పంటలకు సమయానికి ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేసేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చినంకా రైతుబంధు ఎప్పుడు వస్తదోనని అన్నదాతలందరూ ఎదురుచూస్తున్నారు. ఇచ్చే కొద్దిపాటి డబ్బులు కూడా రెండు, మూడు విడతల్లో వేస్తే అవి ఏమిటికి ఉపయోగపడవు. కాంగ్రెస్ వచ్చినంకా రైతులకు కష్టాలు తప్పడం లేదు.
– పెద్దగోల్ల అంజయ్య, రైతు, కుమ్మరిగూడ(షాబాద్)
ప్రభుత్వం రైతుభరోసా నిధులు విడతలవారీగా అందిస్తే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో రైతుభరోసా నిధుల విడుదల ఆలస్యం జరుగుతుంది. దీని వల్ల రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎకరం, రెండెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది.
– ముత్యం శంకర్‌గౌడ్, శంకర్పల్లి మున్సిపాలిటీ