Rythu Bharosa | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా రైతుభరోసా పథకం జాడేలేదు. ఇప్పటికే వానకాలంలో పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం.. ఈ రబీ సీజన్లోనైనా ఇస్తుందా..? లేదా..? అనే ఆందోళన అన్నదాతలను వెంటాడుతున్నది. ఖరీఫ్‌లో పంటల సాగుకు సర్కారు పెట్టుబడి సాయాన్ని అందించకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకొచ్చి పంటలను సాగు చేశామని.. అప్పటి అప్పులే ఇంకా తీరలేదని.. కొత్తగా అప్పులు పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి రెండు పంటలకు అదునుకు పెట్టుబడి సాయం అందడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంటలను సాగు చేసుకున్నామని రైతులు పేర్కొంటున్నారు. రేవంత్ సర్కారు.. ఇప్పుడి స్తాం.. అప్పుడిస్తామనే ప్రకటనలు మాని రైతుభరోసా పథకం కింద వెంట నే అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
-షాబాద్, డిసెంబర్ 29
2023 ఖరీఫ్ సీజన్ గణాంకాల ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజవర్గాల పరిధిలోని 27 మండలాలకు సంబంధించి సుమారు 2.80 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున ప్రతి సీజన్‌కూ రూ. 360 కోట్ల చొ ప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ప్రకారం ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.7,500 చొప్పున అందజేస్తే రూ. 400 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రతిఏటా అక్టోబర్ నుంచి యాసంగి సీజన్ మొదలవుతుంది. గత ఖరీఫ్ సీజన్లో రైతుభరోసా ఇవ్వకపోవడంతో సుమారు రూ. 360 కోట్లు రైతులపై భారం పడింది. ఈ యాసంగికి కూడా మరో రూ. 360-రూ.400 కోట్ల మేర ఆర్థిక భారం పడే అవకాశముంది. సర్కారు వానకాలం, యాసంగి కలిపి ఇవ్వాలంటే ఎకరానికి రూ.15 వేల చొప్పున ఈ భారం రెట్టింపు కానున్నది. గత బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం ప్రారంభమైన ప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాను జాప్యం చేస్తున్న కారణంగా సాగు విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఉన్నది.
యాసంగి సాయం కోసం ఎదురుచూపు…!
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ పంట పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడంతో.. ఈ యాసంగికైనా ఇస్తుందా..? అని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తు న్నారు. వానకాల పంటల సాగుకు రైతులు అప్పులు చేశారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలతో పంటలు దెబ్బతిని అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. దీనికి తోడు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఏ విధంగా తీర్చాలో తెలియక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు ఇస్తుంటే, ఈ ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రూపాయీ చెల్లించకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15000 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతుభరోసా వెంటనే అందించాలి
ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుభరోసాను అం దించాలి. గత ప్రభుత్వం ఏడాదికి రూ.10వేలు అందించి రైతులకు అండగా నిలిచింది. రేవంత్ సర్కారు పంట పెట్టుబడి సాయాన్ని అందించకపోవడంతో అప్పులు తీసుకొచ్చి పంటలను సాగు చేస్తున్నాం.
– పి.కుమార్, కుమ్మరిగూడ(షాబాద్)
రైతులను మోసం చేసింది..
ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలిచ్చింది. రైతులను నిలువునా మోసం చేసింది. పంట రుణాల మాఫీ సగం మందికి కూడా కాలేదు. ఎకరానికి రూ.7,500 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికీ రూపాయీ ఇవ్వలేదు. వానకాలం సీజన్ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడంతో అన్నదాతలు అప్పులు చేసి పంటలను సాగు చేసుకున్నారు. ప్రభుత్వం రైతుభరోసాపై ప్రకటనలకే పరిమితమైంది.
– గంగిడి భూపాల్‌రెడ్డి, హైతాబాద్(షాబాద్)