రైతు భరోసాపై జిల్లా రైతాంగం భగ్గుమంటున్నది. ఎన్నికలకు ముందు రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన ఏడాదికి రూ.12 వేలు ఇస్తామంటూ ఇచ్చిన మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో టింగ్ టింగ్ మంటూ రైతు భరోసా మెసేజ్ వస్తుందని ప్రగల్భాలు పలికి.. తీరా 10 శాతం మందికి కూడా పెట్టుబడి సాయాన్ని అందించలేకపోయిందని జిల్లావాసులు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆయా మండలాల్లో తక్కువ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి పెట్టుబడి సాయాన్ని అందజేసింది. అర్హులు దాదాపు 2 లక్షల మంది ఉండగా, ఇచ్చింది కేవలం సుమారు 8 వేల మందికేనని జిల్లా అంతటా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా మండలంలో ఒక్క గ్రామానికే పెట్టుబడి సాయాన్ని అందించడం ఏమిటని రేవంత్ సర్కార్ను సబ్బండ వర్ణాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 5.80 లక్షల ఎకరాలకుగాను 80 వేల ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా అందించింది. పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సొంత ఊరు శివారెడ్డిపల్లిని ఎంపిక చేయడంపై నియోజకవర్గ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు అదునుకు పెట్టుబడి సాయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారని జిల్లావాసులు గుర్తుచేసుకుంటున్నారు.
– వికారాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుంట భూమి మొదలుకొని అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు సాయాన్ని అందజేశారు. సీజన్ ప్రారంభానికి ముందే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకుగాను రైతుబంధు డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లావ్యాప్తంగా 12.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటిలో అర్హులైన రైతులకు సంబంధించిన 6.20 లక్షల ఎకరాలకుపైగా భూములకు రూ.300 కోట్లకు పైగా పెట్టుబడి సాయాన్ని అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దాదాపు 30 వేల ఎకరాలను తగ్గించి 5.80 లక్షల ఎకరాలకు సాయాన్ని అందించాలని నిర్ణయించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద రూ.2926 కోట్ల సాయాన్ని అందజేసింది. 2018 వానకాలం సీజన్లో 1,94,833 మంది రైతులకుగాను రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 1,78,998 మంది రైతులకుగాను రూ.255 కోట్లు, యాసంగి సీజన్లో 1,71,824 మంది రైతులకుగాను రూ.194 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించింది.
2020 వానకాలం సీజన్లో 2,113,341 మంది రైతులకు రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మంది రైతులకు రూ.301 కోట్ల పెట్టుబడి, 2021 వానకాలం సీజన్లో 2,25,438 మంది రైతులకుగాను రూ.300 కోట్లు, యాసంగి సీజన్లో 2,24,928 మందికిగాను రూ.241 కోట్ల పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం అందజేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,47,707 మంది రైతులకుగాను రూ.305 కోట్ల రైతుబంధు సాయం, యాసంగిలో 2,43,447 మందికిగాను రూ.299 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,62,065 మంది రైతులకు రూ.307.47 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసింది.
ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క పథకాన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నది. సర్కారు ఏర్పడి 14 నెలల తర్వాత మండలానికి ఒక ఊరికే రైతు భరోసా ఇవ్వడం బాధాకరం. పెట్టుబడి కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో అదునుకు రైతుబంధు డబ్బులు వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– బీ రాజు కెరెళ్లి, ధారూరు మండలం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదునుకు పెట్టుబడి సాయం అందేది. నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నా. ఎరువులు, విత్తనాల కోసం బాకీ చేయాల్సి వచ్చింది. వానకాలంలో పంట దెబ్బతిన్నది. రైతు భరోసా రాక, పంట చేతికి అందక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రైతు భరోసా అందజేయాలి.
-ఎన్.యాదిరెడ్డి, రావులపల్లి, మర్పల్లి మండలం
ఎవుసం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. రూ.లక్ష అప్పు చేసి ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేశా. బీఆర్ఎస్ హయాంలో సమయానికి పెట్టుబడి సాయం అందేది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిండు. వీలైనంత త్వరగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి.
– నీలి శంకర్, మర్పల్లి కలాన్, మర్పల్లి మండలం
ఎన్నికలకు ముందు ఏడాదికి ఎకరాకు రూ.15 అందజేస్తామని చెప్పి. ప్రస్తుతం రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా నయా పైసా ఇవ్వలేదు. నేడు రేపు అంటూ దాటవేస్తున్నది. ఇప్పటికైనా అదునుకు పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటే మంచిది. లేదంటే రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు.
– నర్సింహారెడ్డి, మోమిన్ఖుర్దు, ధారూరు మండలం