బొంరాస్‌పేట, మార్చి 12 : మాకు ఫార్మా విలేజ్ వద్దే..వద్దంటూ అన్నదాతలు చేపట్టిన నిరసన సెగ హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు తాకింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలంలోని నాలుగుగ్రామాల పరిధిలో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సం కల్పించింది. సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలు రోజు రోజుకూ తీవ్రతరమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అధికారులు హకీంపేట, పోలేపల్లి, లగచెర్ల, పులిచర్లకుంట తండాల పరిధిలోని అసైన్డ్, పట్టా భూములను పరిశీలించారు. దీంతో అప్రమత్తమైన రైతులు ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని స్థానిక తహసీల్దార్‌తోపాటు కడా ప్రత్యేకాధికారికి వినతిపత్రాలను అందించడంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దుద్యాల మండల కేం ద్రంతోపాటు హకీంపేట గ్రామంలో ధర్నాలు నిర్వహించి తమ నిరసనను తెలుపుతున్నారు. నాలుగు గ్రామాల పరిధిలోని 1,274 ఎకరాల అసైన్డ్, పట్టా భూ ముల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేస్తే వాయు, నీటి కాలుష్యం ఏర్పడుతుందని, తరతరాలుగా భూములను సాగు చేసుకుని జీవిస్తున్న పేద రైతులు రోడ్డున పడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఈ నాలుగు గ్రా మాల పరిధిలోని వ్యవసాయ భూములపై రాత్రివేళల్లో డ్రోన్లు తిరుగడంతో ఫార్మా విలేజ్ ఏర్పాటు ఖాయమనే అభిప్రాయం రైతుల్లో బలంగా నాటుకున్నది. అందుకే ఈ ప్రతిపాదనను విరమించుకుంటామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ వెనుదిరిగి చూడొద్దని తీర్మానించుకున్న రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఇందులో భాగంగానే ఆ నాలుగు గ్రామాలకు చెందిన వందమంది రైతులు మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్కెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రజావాణి ప్రత్యేకాధికారిణి దివ్యాదేవరాజన్‌కు తమ గోడును చెప్పి వినతిపత్రాన్ని అందజేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఫార్మా విలేజ్ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు.