రంగారెడ్డి, మే 7(నమస్తేతెలంగాణ):రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను హమాలీల కొరత వెంటాడుతున్నది. కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తున్నప్పటికీ హమాలీల కొరతతో రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హమాలీలు దొరికే వరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల బయటనే ఉంచుతుండటంతో వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నది. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లోనూ నెలకొన్నది.
ముఖ్యంగా జిల్లాలోని హమాలీలంతా బీహార్ ఇతర రాష్ర్టాలకు చెందిన వారే ఉన్నారు. ధాన్యం కొనుగోలు సీజన్ అధికం కావడంతో హమాలీలంతా రైస్ మిల్లుల వైపు వెళ్తున్నారు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రావడానికి మొగ్గు చూపడంలేదు. దీంతో అదనంగా హమాలీలు దొరుకటం ఇబ్బందికరంగా మారింది.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తాము పండించిన ధాన్యాన్ని పెద్దఎత్తున విక్రయించటానికి తీసుకువస్తున్నారు. అధికారులు నిర్ణయించిన లక్ష్యానికంటే ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశాలున్నాయి. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 2.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అంచనాకు మించి ధాన్యం దిగుబడులు రావడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు బారులు తీరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరతోపాటు బోనస్ కూడా వస్తుందని రైతులు ధాన్యాన్ని తీసుకువస్తున్నారు.
జిల్లాలోని శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున రైస్‌మిల్లులు ఏర్పాటు చేశారు. నగరంలో ఉన్న రైస్‌మిల్లు కూడా శివారు ప్రాంతాలకు తరలించారు. దీంతో బీహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన హమాలీలంతా రైస్‌మిల్లుల్లోనే పని చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత ఏర్పడింది. రైస్‌మిల్లుల్లో పర్మినెంట్‌గా పనులు దొరుకుతుండటంతో తాత్కాలిక కొనుగోలు కేంద్రాలకు వెళ్లటానికి ఇష్టపడటంలేదు.
జిల్లాలో డీసీఎంఎస్, ఐకేపీల ఆధ్వర్యంలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం వస్తున్నది. ఈ ధాన్యాన్ని సకాలంలో నింపటానికి హమాలీలు దొరకడంలేదు. హమాలీలు వచ్చే వరకు రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల ముందు ధాన్యాన్ని ఉంచి రైతులు వెళ్లిపోతున్నారు.అకాల వర్షాలు రాత్రిపూట వస్తుండటంతో ధాన్యం రాశులు, బస్తాలు పూర్తిగా తడిసిపోతున్నాయి. తెల్లారి ధాన్యాన్ని మళ్లీ ఆరబోసుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. కొన్ని ప్రాంతాల్లో రైతులే హమాలీలను తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడింది.
కొనుగోలు కేం ద్రాల్లో హమాలీలు లేక ధాన్యం ఇక్కడే మూలుగుతున్నది. ఉదయం వచ్చి ధాన్యం ఎండబోసి పోతున్నాం. రాత్రి వర్షం వచ్చి ధాన్యం తడిసిపోతున్నది. వెంటనే ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలను ఏర్పాటు చేసి రైతులను కాపాడాలి.
– పద్మ, మహిళా రైతు