Varanasi Row : యూపీ, వారణాసిలోని పవిత్ర గంగా నదిలో కొంతమంది యువకులు ఇఫ్తార్ విందు జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు 14 మందిని అరెస్టు చేశారు. ఇటీవల గంగా నదిపై ఒక బోటులో ఒక వర్గానికి చెందిన యువకులు ఇఫ్తార్ విందు చేసుకున్నారు. గంగా నదిలో బోటుపై ప్రయాణిస్తూ వివిధ పదార్థాలుసహా చికెన్ బిర్యానీ వంటి నాన్ వెజ్ తిన్నారు.
పైగా మిగిలిన బిర్యానీ, ఎముకలు వంటి పదార్థాల్ని నదిలోనే పడేశారు. అంతేకాదు.. దీన్నంతటినీ వీడియో తీసుకుని, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవిత్రంగా భావించే గంగానదిలో విందు చేసుకోవడం, నాన్‌వెజ్‌ను నదిలో పారేయడం ఏంటని కొందరు హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రజత్ జైశ్వాల్ అనే వ్యక్తి కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా చేయడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు.
విందు చేసుకున్న 14 మందిని గుర్తించి, అరెస్టు చేశారు. మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నదిలో బోటుపై విందు చేసుకోవడానికి గల కారణాలపై నిందితుల్ని విచారిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.