యాచారం, జూన్ 26 : మా భూములు మాకు కావాలని, రైతులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, హైకోర్టు ఆర్డర్‌ను వెంటనే అమలు చేయాలని ఫార్మా బాధిత రైతులు నినదించారు. ఫార్మా బాధిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే మరో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మా బాధిత గ్రామాలైన మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు గురువారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి ఉపయోగిస్తామనడం పట్ల రైతులు సమావేశమయ్యారు. రైతులకు భూములు ఇచ్చేది లేదని ఆయన చేసిన వ్యాఖ్యలను రైతులు తప్పుపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాసిటీకి ఇవ్వని భూములను తీసుకోవద్దని, ఫార్మాకు ఇవ్వని భూముల జోలికి రాకుండా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రైతులు మూకుమ్మడిగా నినదించారు.
గతంలో రైతుల వెంట ఉండి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నాయకులు నేడు పదవులు రాగానే ఫార్మా రైతులకు అన్యాయం చేయాలని చూడడం ఎంతవరకు సమంజసం అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా బాధిత రైతుల సమస్యలను పట్టించుకోకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు వారు హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ.. ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి వాడుకుంటామని ఎమ్మెల్యే చెప్పడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు. ఫార్మాసిటీ భూములను ఫ్యూచర్ సిటీకి ఎలా ఉపయోగిస్తారని ఆమె ప్రశ్నించారు. ఫార్మాసిటీ కోసం ఇవ్వని భూములను రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అట్టి 2500ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఫార్మాసిటీకి భూములు ఇవ్వని రైతులందరికీ ప్రభుత్వం వెంటనే రైతు భరోసాను ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. రైతు బీమా పంట రుణాలతో పాటు ప్రభుత్వ పథకాలను వర్తించేలా చూడాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన అధికారులకు ఇప్పటికే నోటీసులు అందినట్లు ఆమె గుర్తు చేశారు. రైతుల భూముల జోలికి రావద్దని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కానమోని గణేష్, సామ నిరంజన్, కుందారపు సత్యనారాయణ, వినోద్ కుమార్ రెడ్డి, అచ్చిరెడ్డి, సందీప్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పాపిరెడ్డి గడ్డం యాదయ్య, గడ్డం కుమార్, రైతులు ఉన్నారు.