రంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : వానలు కురుస్తుండడంతో జిల్లాలో పంటల సాగు ప్రారంభమైంది. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు ఇతరత్రా పంటలు వేయటంలో రైతులు బిజీగా ఉన్నారు. ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు ఫర్టిలైజర్ షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. మరోవైపు యాప్ ద్వారానే ఎరువులను తీసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు యాప్‌పై అవగాహన లేకపోవటం తో ఎరువులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లోని రైతులకు యాప్ అవగాహన లేకపోవడంతో వారికి ఇబ్బందిగా మారింది.
రైతులకు యాప్ ద్వారా యూరియా అందించేందుకు ఏఈవోలు, వలంటీర్లు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించినా వారు అన్నదాతకు సహకరించడంలేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ఏఈవోలు ఫర్టిలైజర్ షాపులతో కుమ్మక్కవుతున్నారని.. రైతులకు సహకరించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ వానకాలంలో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు.

కానీ, రైతు ల అవసరాలు మాత్రం అంతకు మించి ఉన్నది. కాగా, 1,60,000 ఎకరాల్లో వరి, 1,94,600 ఎకరాల్లో పత్తి, 77,500 ఎకరాల్లో మొక్కజొన్న, 53,500 ఎకరాల్లో ఉద్యానవన పంటలు, మరో 50 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు కానున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అధికారుల అంచనాకు ఎరువులు ఏ మాత్రం సరిపోనట్టు సమాచారం. దీంతో రైతులు యూరియా కోసం ఫర్టిలైజర్ షాపుల ఎదుట క్యూ కడుతున్నారు. యూరియా ను సహకార సంఘాల ఆధ్వర్యంలో విక్రయిస్తుండడంతో రైతులు ప్రతిరోజూ అక్కడికెళ్లి ఉదయం నుంచే నిరీక్షిస్తున్నా అందుబాటులో ఉండడంలేదు. కాగా, ఖరీఫ్‌లో సాగు చేసే పంటల కోసం 27 వేల మెట్రిక్ టన్నుల యూ రియా అవసరం ఉంటుందని అధికారులు భావిస్తుండగా.. ఇప్పటివరకు 7 వేల మెట్రిక్ టన్నులే అందుబాటులో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
పూడూరు, జూన్ 18 : యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి లారీ యూరియా రాగా రైతులు ఎగబడ్డారు. అక్కడి సిబ్బంది ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇచ్చారు. ఫోన్ సిగ్నల్ కలువకున్నా.. యాప్ ద్వారా బుక్ చేయకున్నా యూరియా బస్తా ఇవ్వలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫర్టిలైజర్ షాపులకు వచ్చి యూరియాను త్వరగా తీసుకెళ్లి వ్యవసాయ పనులు చేసుకునే వారిమని.. ఇప్పుడు యాప్ తీసుకురావడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.