బంట్వారం, ఏప్రిల్ 12 : మండల కేంద్రంలో ఉన్న కొల్లం చెరువు నిండుకుండలా ఉన్నా చుక్క నీరు మాత్రం పొలాలకు పారడం లేదు. దీని కింద 360 ఎకరాల ఆయకట్టు ఉండగా.. రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తూ నష్టపోతున్నారు. చెరువు కాల్వ లు ముళ్లపొదలతో నిండి శిథిలావస్థకు చేరా యి. అంతేకాకుండా తూము నుంచి నిత్యం నీరంతా లీకేజీ అవుతున్నా వాటికి మరమ్మతులు చేసే నాథుడే లేడు. గతంలో చెరువు నీటితో వంద ఎకరాల్లో రైతులు పంటలను పండించేవారు.. అయితే ప్రభుత్వ తీరు, అధికారుల అలసత్వంతో చెరువు ఆదరణకు నోచుకోవడం లేదు.
ఆయకట్టు రైతుల పొలా లు చుక్క నీరు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో కొల్లం చెరువును పునరుద్ధరించింది. రూ. 54.30 లక్షలతో చెరువులోని పూడికను తీయడంతోపాటు కొత్త కాల్వలను నిర్మించిం ది. 650 మీటర్ల పొడవు ఉన్న కట్టను 3 మీట ర్ల ఎత్తుకు పెంచడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి.. పుష్కలంగా నీళ్లు నిండాయి. 360 ఎకరాల ఆయకట్టు రైతుల పొలాలకు నీటిని అందించేందుకు 160 మీటర్ల సీసీ కాల్వలను నిర్మించింది.
కాంగ్రెస్ పాలనలో కొల్లం చెరువు ఆదరణ కోల్పోయింది. నిండు వేసవిలోనూ నీటితో నిండుకుండలా ఉన్నా.. ఆయకట్టు పొలాలకు మాత్రం చుక్క నీరు అందడం లేదు. తూము విరిగి చెరువులో పడిపోయింది. ముళ్లపొదలతో నిండి కాల్వలు శిథిలావస్థకు చేరడంతో పొలాలకు నీరు అందే పరిస్థితే లేకుండా పో యింది. చెరువు అలుగు నుంచి నిత్యం నీరు లీకేజీ అవుతున్నా..దానిని అరికట్టేందుకు ఎవ రూ ముందుకు రావడం లేదు. లీకేజీలు, కా ల్వలను మరమ్మతులు చేసి.. పొలాలను నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు.
నా పొలం పక్క నుంచే కాల్వ వెళ్తుంది. అయితే, ఆ కాల్వ పగిలిపోయి వానకాలంలో నీరంతా పొలంలోకి వచ్చి పంట మొత్తం నాశనమవుతున్నది. వానకాలంలో అలా ఉంటే.. యాసంగిలో పొలానికి చుక్క నీరు అందని పరిస్థితి నెలకొన్నది. చెరువు నిండుకుండలా ఉన్నా కాల్వలు సక్రమంగా లేకపోవడంతో నా పొలానికి నీరందక ఎండిపోతున్నది. ఇలా రెండు రకాలుగా నష్టపోతున్నా. నాకున్న 12 ఎకరాల్లో ఏ పంట వేసినా చేతికి రావడం లేదు. అధికారులు స్పందించి కాల్వలకు మరమ్మతులు చేయించాలి. -పాపయ్య రైతు, బంట్వారం
చెరువు అలుగు నీటితో చాలా నష్టపోతున్నా. వానకాలంలో చెరువు నిండి అలుగు పోయడంతో ఆ వరదతో పొలం కోతకు గురై ఏ పంట సాగు చేసినా పండడం లేదు. అలుగు పోస్తున్న ప్రాంతంలో కొంతవరకు రక్షణ గోడ నిర్మిస్తే బాగుంటుంది. కానీ, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పక్కనే చెరువున్నా.. ఏమి లాభం లేదు. చెరువు నిర్మాణానికి తన సొంత పొలం 12 ఎకరాలను ఇచ్చా. -మౌనేశ్, రైతు, బంట్వారం
చెరువులో ఏమి జరిగినా మాకేమి సంబంధం లేదు. దానిని నీటి పారుదల శాఖ వారే చూసుకోవాలి. కాల్వల నిర్మాణం, నీటి సరఫరా తదితర అంశాలను ఆ అధికారులదే బాధ్యత.
– విజయ్‌కుమార్, తహసీల్దార్, బంట్వారం