రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోనున్నది. ప్రస్తుతం జిల్లాలో రైతు భరోసా కింద 3,25,216 మంది రైతులు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం ద్వారా పంటలు సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా వీరి కోసం ప్రభుత్వం రూ.343.10 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. కానీ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన సర్కారు రైతు భరోసా కింద ఆర్థిక సహాయం అందించడానికి అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో రైతు భరోసా కింద లబ్ధిపొందే రైతుల్లో సగానికి తగ్గనున్నారు.
ముఖ్యంగా జిల్లాలో వ్యవసాయ భూములు.. వ్యవసాయేతర భూములను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొండలు, గుట్టలు, వెంచర్లల్లో కూడా రైతు పేర్లపై పట్టాలకు గత సర్కారు రైతులకు రైతు బంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించింది. కాని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సాగుకు యోగ్యంగా ఉన్న భూములనే గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను సేకరించే పనిలో ఉన్నారు.
– రంగారెడ్డి, జనవరి 12 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డిజిల్లాలో మొత్తం 12, 42,504 ఎకరాల భూములున్నాయి. ఇందులో 805 లక్షల ఎకరాల వ్యవసాయేతర భూములున్నాయి. నగర శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్లాలో శంషాబాద్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, మొయినాబాద్, శంకర్పల్లి లాంటి మండలాల్లో రియల్ ఎస్టేట్ పుణ్యమా అంటూ భూములన్నీ ప్లాట్లుగా మారిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కందుకూరు, కడ్తాల్, షాద్‌నగర్, కొందుర్గు, కొత్తూరు తదితర మండలాలు మాత్రమే వ్యవసాయానికి యోగ్యంగా ఉన్నాయి. ఈ భూముల్లో సాగుచేస్తున్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం అందుతున్నది.
ప్రసుత్తం రంగారెడ్డి జిల్లాలో యాసంగిలో 1,39,000 ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలను సాగుచేశారు. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంటలు సాగు చేసే రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందనున్నది. జిల్లాలో గతంలో వందల ఎకరాల భూములు కొనుగోలు చేసిన వారు కూడా రైతు బంధు పథకం కింద పరిహారం తీసుకునేవారు. జిల్లాలో భవిష్యత్తులో ఎక్కువ శాతం భూముల ధరలు పెరిగే అవకాశమున్నందున కొండలు, గుట్టలు, రాళ్ల భూములు కూడా కొనుగోలు చేశారు. ఈ భూములకు కూడా రైతు బంధు వర్తించేది. ప్రస్తుత ప్రభుత్వ లెక్కల ప్రకారం కొండలు, గుట్టలు వంటి ప్రాంతాలకు కూడా రైతు బంధు వచ్చే అవకాశాలు లేవు. దీంతో జిల్లాలో రైతు భరోసా గణనీయంగా తగ్గే అవకాశమున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగుతో సంబంధం లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకూ రైతు బంధును అందించింది. కాని, ప్రస్తుత సర్కారు సాగుకు యోగ్యమయ్యే భూములు, యోగ్యంకాని భూములు, కొండలు, గుట్టలను గుర్తించే పనిలో పడింది. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం రైతు బంధు తీసుకుంటున్న రైతుల్లో రైతు భరోసాకు లక్షమందికి కూడా భరోసా అందుతుందనే భరోసా లేకుండా పోయింది. సంక్రాంతి తర్వాత సాగుకు యోగ్యమైన భూములను మాత్రమే గుర్తించి వారికే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలోని జిల్లాస్థాయి అధికారులందరితో సమావేశం నిర్వహించి, సాగుకు యోగ్యమైన భూములను గుర్తించాలని ఆదేశాలు జారీచేశారు. గత సర్కారు హయాంలో 3.22 లక్షల మంది రైతులను రైతుబంధు పథకం కింద అర్హులుగా ఎంపిక చేసింది. వీరికి ఏటా రూ.343.10 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమచేసేది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో పెట్టిన ఆంక్షల ఫలితంగా ఇందులో సగం మంది రైతులకు కూడా రైతు భరోసా అందే అవకాశాలులేవు. దీంతో జిల్లాలో రైతు బంధు పథకం కింద అర్హులైన రైతుల కోసం నేటి నుంచి సర్కారు జల్లెడపట్టే అవకాశాలున్నాయి.