కొడంగల్, మే 12 : ప్రభుత్వం ధాన్యం కొను గోళ్లలో జాప్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన ఓ రైతు పంట అకాల వర్షంతో నేల పాలైంది. మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామానికి చెందిన శ్రీనూనాయక్ తనకున్న మూడు ఎకరాల్లో వరిని సాగు చేశాడు. తీవ్ర ఎండలు, నీటి కొరతతో పంట సగం కూడా పండలేదని, కేవలం 10 బస్తాల ధాన్యమే చేతికొచ్చిందన్నాడు. ఆ పంటను కొనుగోలు కేంద్రంలో తూ కం వేయకపోవడంతో నేరుగా రైస్‌మిల్‌కు తర లించాడు.
అయితే, అక్కడ తేమ శాతం ఎక్కువగా ఉన్నదని రైస్‌మిల్ నిర్వాహకులు చెప్పడంతో ఆ వడ్లను కొడంగల్ నుంచి గౌరారం వెళ్లే రోడ్డుపై ఆరబెట్టాడు. సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో నీటి ప్రవాహానికి వడ్లు మొత్తం పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పారడంతో అతడు కన్నీరుమున్నీరయ్యాడు. పంటను కొనుగోలు కేంద్రంలో సేకరించి ఉంటే ఈ విధంగా నష్టం జరిగేది కాదని.. పంట మొత్తం నేల పాలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మాదిరిగా ఎంతోమంది రైతులు ఈ విధంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి పాయె.. చేతికొచ్చిన పది బస్తాల ధాన్యమూ నేలపాలై దాదాపు రూ 20 వేలకు పైగా నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.