వికారాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గత వారం, పది రోజులుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురువడంతో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. అయితే వరినాట్లు వేస్తుండడంతోపాటు మొక్కజొన్న, పత్తికి రెండో విడతగా యూరియా తప్పనిసరిగా వేయాల్సి ఉండడంతో యూరియా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లాకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ…వాస్తవానికి సరిపోను స్టాక్ లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతుల గోస చూస్తే తెలుస్తున్నది.
జిల్లాలో ఉన్న యూరియా అరకొర నిల్వలతో రైతులు వ్యవసాయ పనులు వదులుకొని అగ్రో రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల వద్ద పడిగాపులు పడుతున్నారు. యూరియా కోసం రైతులు వ్యవసాయ పనులు వదులుకొని ఉదయం నుండి భారీ క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్నారు. అన్ని పనులు వదులుకొని బారులు తీరుతున్న రైతుల్లో కొందరికి మాత్రమే యూరియా దొరుకుతుందని, మిగతా రైతులు గంటల తరబడి క్యూ లైన్లలో ఉన్నా ప్రయోజనం ఉండడం లేదని యూరియా విక్రయ కేంద్రాల నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం.
జిల్లాలో ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో కంటే ప్రైవేట్ డీలర్ల వద్దనే అధిక మొత్తంలో యూరియా నిల్వలు ఉంటున్నట్లు రైతులు చెబుతున్నారు. యూరియా నిల్వలు ఉన్నప్పటికీ నో స్టాక్ అంటూ యూరియాను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో సకాలంలో యూరియా నిల్వలను అందుబాటులో ఉంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయని రైతుల నుండి అభిప్రాయం వ్యక్తమవుతుంది.
జిల్లా రైతాంగానికి సరిపోను యూరియాను సమకూర్చకుండా ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తుంటే, మరోవైపు ప్రైవేట్ డీలర్లు రైతులను మోసం చేస్తున్నారు. అయితే జిల్లాకు వచ్చే యూరియా స్టాక్‌లో ఎక్కువ మొత్తంలో యూరియా నిల్వలు ప్రైవేట్ డీలర్లకే వెళ్తుండడంతో వారు బ్లాక్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే జిల్లాలో ప్రస్తుతం 1138 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉండగా, కేవలం 200 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంది.
మిగతా 876 మెట్రిక్ టన్నుల యూరియా ప్రైవేట్ డీలర్ల వద్దనే ఉండడం గమనార్హం. మెజార్టీ యూరియా నిల్వలు ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్నప్పటికీ విక్రయాలను నిలిపివేసి బ్లాక్ చేస్తూ, ఉన్న స్టాక్‌ను కూడా విక్రయించకుండా కృత్రిమ కొరతను సృష్టించే పనిలో ప్రైవేట్ డీలర్లు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. అయితే యూరియా కొరతను ఆసరాగా తీసుకుంటున్న కొందరు ప్రైవేట్ డీలర్లు బ్లాక్‌లో పెట్టి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కొ బస్తాకు రూ.270 నుండి రూ.280లకు విక్రయించాల్సి ఉండగా, కొందరు ప్రైవేట్ డీలర్లు ఒక్కొ బస్తాకు రూ.350-రూ.400ల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. పైవేట్ డీలర్లను నిఘా పెట్టాల్సిన వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలో సరిపోను యూరియా లేకపోవడంతోనే ఇబ్బందులు పడుతున్నామని రైతులు తమ గోడును వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయాధికారులు జిల్లా అంతటా సరిపోను యూరియా స్టాక్ ఉందని చెబుతున్నా… వారు అధికారికంగా ఇచ్చే స్టాక్ నిల్వలను చూస్తే జిల్లాలో ఎక్కడా కూడా యూరియా స్టాక్ లేదనే విషయం తెలుస్తున్నది. సరిపోను యూరియా ఉంటే రోజుల తరబడి క్యూ లైన్లలో ఎందుకు పడిగాపులు పడుతామని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అయితే జిల్లాలో సాగు చేసే పంటలను బట్టి యూరియాకు సంబంధించి జిల్లాకు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరంకాగా, ప్రస్తుతం జిల్లాలో కేవలం 1138 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు వెల్లడించారు. అందుబాటులో ఉన్న యూరియా ప్రైవేట్ డీలర్ల వద్ద 876 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద 45 మెట్రిక్ టన్నులు, ఎఫ్ఎస్సీఎస్ కేంద్రాల వద్ద 10 మెట్రిక్ టన్నులు, అగ్రో కేంద్రాల్లో 104 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ కేంద్రాల్లో 90 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌పీవో కేంద్రాల్లో కేవలం 9 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు.
అయితే ఇప్పటికే కొంతమేర యూరియాను రైతులు కొనుగోలు చేశారని చెబుతున్నా…సరిపోను యూరియా లేదనే విషయం తెలుస్తున్నది. అందుబాటులో యూరియా ఉందని అధికారులు చెబుతున్న జిల్లావ్యాప్తంగా క్యూ లైన్లలో నిల్చున్న రైతులు కొనుగోలు చేస్తే గంటలో స్టాక్ అంతా పూర్తవుతుందని రైతు నాయకులు పేర్కొంటున్నారు. వర్షాలు కురిస్తే ఒక్కసారిగా యూరియా కొనుగోలుకు డిమాండ్ పెరుగుతుందని గుర్తించని అధికారులు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్నిప్రాంతాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం జిల్లాలో స్టాక్ ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొందుర్గు: మండలంలో యూరియాకోసం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందుర్గు పీఏసీఎస్ వద్ద శుక్రవారం ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. కేవలం 200 బస్తాల యూరియా మాత్రమే రావడంతో చాలామందిరైతులకు అందలేదు. పూర్తిస్థాయిలో యూరియాను అందజేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. గంటల తరబడి క్యూలో నిలబడినా యూరియా రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
షాబాద్ : యూరియా కోసం అన్నదాతలు అనేక అవస్థలు పడుతున్నారు. శుక్రవారం షాబాద్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం వద్ద ఉదయం నుండే రైతులు పడిగాపులు కాస్తూ, క్యూలో నిల్చున్నారు. గత పదేళ్ల కాలంలో ఎన్నడూ కూడా యూరియా కోసం ఇంత కష్టం పడలేదని రైతులు వాపోతున్నారు. కార్యాలయం తెరిచిన తర్వాత ఒక్కొ రైతుకు రెండు యూరియా బస్తాలు ఇవ్వడంతో అవి ఏ మాత్రం పంటకు సరిపోవడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవడంతో పంటలకు యూరియా వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న సమయంలో యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.