వికారాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): జిల్లాలో భూముల సర్వే కోసం రైతులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. తమ పొలాల్లో హద్దులను నిర్ధారించాలని, కొలతల్లో వచ్చిన తేడాలను సవరించేందుకు సర్వే చేయాలని చలాన్లు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత కార్యా లయం చుట్టూ నెలల తరబడిగా కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. సర్వేయర్లు ఎప్పుడొస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కారణం సరిపడా సిబ్బంది లేకపోవడంతోపాటు వరుస క్రమంగా కాకుండా రియ ల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూముల సర్వేలను చలాన్ చెల్లించిన రెం డు, మూడు రోజుల్లోనే పూర్తి చేస్తున్న అధికారులు.. రైతులను మాత్రం నెలల తరబడి తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత మార్చి నెలలో పూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతులు తమ పేరిట ఉన్న 15 ఎకరాల భూమిని సర్వే చేయించాలని భావించి చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ చివరి వరకూ సర్వేయర్ పట్టించుకోకపోవడంతో రైతులు అతడితో మాట్లాడగా రూ.లక్ష లంచం చెల్లించాలని డిమాండ్ చేయగా వారు కొంత డబ్బును అతడికి ఇచ్చినా ఇప్పటివరకు కూడా సర్వే చేసేందుకు రాలేదని మండిపడుతున్నారు. డబ్బులు తీసుకొని కూడా సర్వేయర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని.. కార్యా లయానికెళ్తే అందుబాటులో ఉండడంలేదని ఆరోపిస్తున్నారు. ఇలా కొందరు సర్వేయర్లపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలో భూముల సర్వేకు సంబంధించిన దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. తమ పొలాల్లో హద్దులను నిర్ధారించాలని, కొలతల్లో వచ్చిన తేడాలను సవరించాలని దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో భూక్రయ, విక్రయాలు పెరగడంతోపాటు భూకొలతల్లో చాలా వ్యత్యాసాలు వస్తున్నాయి. కొందరు రైతులకు రికార్డుల్లో భూమి ఎక్కువుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం తక్కువగా ఉంటున్నది. మరికొందరికీ క్షేత్రస్థాయిలో భూమి తక్కువగా ఉంటే, రికార్డుల్లో ఎక్కువగా చూపిస్తుండడంతో.. పక్క పక్కన పొలాలున్న రైతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి.
కాగా, జిల్లాలో ఆర్ఎస్ఆర్ సమస్య లేని గ్రామాల్లేవని రెవెన్యూ ఉన్నతాధికారులే స్పష్టం చేస్తున్నారు. సర్వేతోనే భూముల కొలతల్లో హెచ్చు, తగ్గులకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు. ఆర్ఎస్ఆర్ సమస్యతోపాటు జిల్లాలో అధిక మొత్తంలో ధరణి దరఖాస్తులూ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో భూముల సర్వే కోసం వచ్చిన అప్లికేషన్లు 2 వేల వరకు పెండింగ్లో ఉన్నాయి. అందులో ఎక్కువగా పేదలవే కావడం గమనార్హం. రియల్టర్ల భూముల సర్వే చురుగ్గా అవుతూ.. తమవి మాత్రం నెలల తరబడిగా పెండింగ్లో ఉండడంతో రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.