ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం యూరియా కోసం అన్నదాతలు ఉదయం నుంచే క్యూలైన్లలో నిరీక్షించారు. సరిపడా పంపిణీ చేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూడా ల్సి వస్తున్నదని అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల కిందట ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంట చేతికి రావాలంటే మందు వేయాలని.. అదును దాటాక యూరియా వేస్తే ఏమి ఫలితం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
షాబాద్, ఆగస్టు 25 : వానకాలంలో పంటలకు వేసేందుకు యూరియా దొరకక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించకపోవడంతో వారు సహకార సంఘాల కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు రెండు సంచుల యూరియా మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతుండడంతో అన్నదాతలు ఆగ్రహానికి గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమను యూరియా కొరత వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం మండల కేంద్రంలోని సహకార సంఘానికి 450 బస్తాల యూరియా వచ్చిందని రైతులకు తెలియడంతో పెద్ద ఎత్తున వచ్చి కార్యాలయం వద్ద బారులుదీరారు. కొంతమంది రైతులు ఒక్కొక్కరుగా వచ్చి క్యూలో నిలబడగా, మరికొంత మంది తమ భార్యలతో కలిసి రాగా, వృద్ధులు కూడా వచ్చి లైన్లో నిరీక్షించారు. గత మూడు రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా దొరకడం లేదన్నారు. రైతుల గు రించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
సీజన్‌కు సంబంధించిన ఎరువులను సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొంతమంది వృద్ధులు లైన్లో నిలబడేందుకు ఓపిక లేకపోవడంతో కార్యాలయం ఎదుటే పడుకున్నారు. కాగా రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసుల పహారాలో అధికారులు యూరియాను పంపిణీ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా సరఫరా చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
మర్పల్లి : యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా కేంద్రం, పీఏసీఎస్ వద్ద సోమవారం ఉదయం నుంచి 11 గంటల వరకు వేచి ఉన్నారు. యూరియా ఉన్నా ఇవ్వడం లేదని వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో రోడ్డుపై రైతులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా కోసం గత నాలుగైదు రోజులుగా తిరుగుతున్నా లేదంటున్నారని, రైతులకు ఇవ్వడంలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని..కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను రోడ్డున పడేసిందన్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని రైతులు, వ్యవసాయ అధికారులతో మాట్లాడారు.. కొంతమంది రైతులకు యూరి యా దొరుకగా మిగతా వారు నిరాశతో వెనుదిరిగారు.
యూరియా అందక అవస్థలు
కేశంపేట : మండలంలోని కొత్తపేట పీఏసీఎస్ వద్ద రైతులు యూరియాకోసం నిరీక్షించారు. సోమవా రం ఉదయం నుంచి మధ్యాహ్న వరకు క్యూలో నిలబడినా పూర్తిస్థాయిలో రైతులకు అందకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. గంటలు, రోజుల తరబడి ఎదురు చూస్తున్నా యూరియా అందడంలేదని మండిపడ్డారు. రోజుకు 450 బస్తాల యూ రియా వస్తుండగా.. అంతకు రెట్టించిన స్థాయిలో రైతులు రావడంతో పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు అధికంగా రావడంతో పీఏసీఎస్ సిబ్బంది స్థానిక పోలీసుల రైతులకు అరకొరగా వచ్చిన యూరియాను అందజేశారు.
ఉప్పరిగూడ సహకార సంఘం వద్ద..
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడలో ఉప్పరిగూడ సహకార సంఘం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయడంలేదని ఉత్తమ రైతు మొద్దు అంజిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాం డ్ చేశారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏ ఒక్కనాడు కూడా రైతులకు యూరియా, ఎరువుల కొరత లేదని.. కానీ.. రేవంత్ పాలనలో మళ్లీ ఉమ్మడి పాలన దుస్థితి నెలకొన్నదని రైతులు ఆరోపించారు.
ఒక్క రైతుకు రెండు సంచులే..
షాద్‌నగర్ : ఫరూఖ్‌నగర్ ప్రాథమిక వ్యవసాయ సహ కార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరి యాకోసం రైతులు గత నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియాతో నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉదయం నుంచే అక్కడ బారులు తీరుతున్నారు. అధికారులు, పోలీసుల పర్యవేక్షణ మధ్య యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఒక రైతుకు కేవలం రెండు సంచులు మాత్రమే ఇస్తుం డడంతో ఏం తోచడంలేదని రైతులు వాపోతున్నారు. అదును దాటితే పంట పండదని ప్రభుత్వం స్పందించి యూరియాను సరిపడా అందించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఏవో నిశాంత్‌కుమార్‌ను వివరణ కోరగా పీఏసీఎస్‌కు రోజుకు 450 బస్తాల యూరియా వస్తున్నదని, రైతులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో పంపిణీ పూర్తిస్థాయిలో జరగడంలేదన్నారు.
యూరియా కోసం గుమిగూడిన రైతులు
దోమ : యూరియా కోసం రైతులు సోమవారం చౌడాపూర్ మండల కేం ద్రంలోని డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రం ఎదుట గుమిగూడారు. నార్లు వేసి నెల రోజులు గడుస్తు న్నా యూరియా అందకపోవడం తో రైతులు అసహనం వ్యక్తం చేశా రు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు అక్కడికి భారీగా తరలివచ్చారు. యూరియా అరకొరగా రావడంపై ఆగ్రహంవ్యక్తం చేశారు.
రోజుల తరబడి ఎదురుచూపులే..
యూరియా కోసం రోజుల తరబడిగా ఎదురు చూడాల్సి వస్తున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిలబడినా ఫలితంలేదు. అన్నంపెట్టే రైతన్నను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.
– మైసయ్య, రైతు, కొత్తపేట
అదును దాటితే లాభం లేదు..
వారం రోజుల కిందట కురిసిన వర్షాలకు పంట చేతికి రావాలంటే మందు వేయాల్సిదే. అదును దాటాక యూరియాను వేస్తే ఏమి ఫలితం ఉండదు. మండలంలో సాగు చేసిన పంటలకు సంబంధించిన వివరాలు అధికారుల వద్ద ఉంటాయి. ఆ లెక్కన ఎంత యూరియా అవసరం ఉంటుందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఈ సమ స్య తలెత్తేది కాదు. రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.
– వెంకటేశ్, రైతు, కొత్తపేట
మూడు రోజులుగా తిరుగుతున్నా..
మూడు రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా దొరకడం లేదు. ఉదయమే వచ్చి లైన్లో నిలబడలేకపోతున్నా. రెండు సంచులే ఇస్తమని అధికారులు చెప్పారు. సర్కార్ ఆలోచన చేసి రైతులకు యూరియా కష్టాలు లేకుండా చేయాలి.
-యాదమ్మ, వృద్ధ్దురాలు, నాగరకుంట, షాబాద్
ఓట్లప్పుడే రైతులు గుర్తుకొస్తరు..
నాయకులకు ఓట్లప్పుడే రైతులు గుర్తుకొస్తరు. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు పల్లెలకు వచ్చి మీకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పుడే తప్ప రైతులకు ఏమి చేస్తలేరు. ఏడెకరాల మొక్కజొన్న పంట వేశా. రెండు సంచుల యూరియా ఇస్తమంటే నేను నా భార్య కలిసి ఉదయం నుంచి లైన్లో నిలబడ్డాం. అయినా ఇద్దరివి కలిపి నాలుగు సంచులే.. అవి మా పంటకు ఏ మాత్రం సరిపోవు. ప్రభుత్వం వెంటనే రైతుల యూరియా కొరతను తీర్చాలి.
-వెంకటేశ్వర్లు, రైతు, బోడంపహాడ్, షాబాద్
రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా..?
యూరియా కోసం గత నాలుగు రోజులుగా షాబాద్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. యూరియా బస్తాలు తక్కువగా వస్తుండడంతో దొరకడం లేదు. ఈ రోజు ఉదయం వచ్చి లైన్లో నిలబడ్డా. చివరి వరకు దొరుకుతదో లేదోననే అనుమానంగానే ఉన్నది. ప్రభు త్వం ఎరువులు సక్రమంగా అందించకుంటే పంట లను ఏలా పండించాలి. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా..?
-రవి, రైతు, మాచన్‌పల్లి, షాబాద్