టెహ్రాన్, మార్చి 17: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ దేశ భద్రతా వ్యూహానికి సారథ్యం వహిస్తున్న ఆ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తమ దాడుల్లో మృతి చెందారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ మంగళవారం వెల్లడించారు. దీంతో ఇరాన్ నాయకత్వంలో మరోసారి సంక్షోభం ఏర్పడింది! ఇప్పటికే అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధంలో మొదటిరోజే తమ సుప్రీం ఆయతొల్లా ఖమేనిని కోల్పోగా, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నట్టు, మరో అగ్ర కమాండర్ ఘోలమ్రెజా సోలేమాని ఇజ్రాయెల్ సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో మరణించారని వార్తలు వచ్చాయి. మరోవైపు యుద్ధం 18వ రోజు కూడా దాడులు, ప్రతిదాడులు ఆగ లేదు. తాజాగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షా గ్యాస్ క్షేతం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది.
లారీజానీ మృతిపై ఇరాన్ స్పందించనప్పటికీ, మార్చి 4న యూఎస్ దాడిలో మరణించిన ఇరాన్ నావికులను స్మరిస్తూ లారీజానీ తన చేతిరాతతో రాసిన ఒక నోట్‌ను ఎక్స్‌లో ఉంచినప్పుడు ఇజ్రాయెల్ ఆయన మరణ ప్రకటన చేసింది. 67 ఏండ్ల లారిజానీ ప్రస్తుతం ఇరాన్లో మొజ్త్తాబా తర్వాతి పదవిలో(స్థానంలో) ఉన్నారు. పరివర్తన కౌన్సిల్లో కలిసి ఆయన దేశంలోని పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం రష్యాలో చికిత్స పొందుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. యూఎస్-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, దీంతో ఆయనను రష్యాకు తరలించి చికిత్స అందజేస్తున్నారని తెలిసింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్కు ఫోన్ చేసి ఖమేనీకి తమ దేశంలో చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారని కువైట్ వార్తాపత్రిక అల్-జరీదా వెల్లడించింది. పుతిన్ నుంచి ఫోన్‌కాల్ వచ్చిన తర్వాత ఖమేనీని మిలిటరీ విమానంలో గురువారం రష్యాకు తరలించారని ఆ వార్తా కథనం పేర్కొంది. అయితే ఈ వార్తను రష్యా నిర్ధారించడం కానీ, తిరస్కరించడం కానీ చేయలేదు. అలాంటి వార్తా కథనాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. అయితే యూఎస్-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ గాయపడినప్పటికీ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అతని చేయి, కాలిపై గాయాలైనట్టు వెల్లడించింది. కాగా, తమ దాడిలో మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడి వికృతంగా మారిపోయాడని అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది.
రాజీ ప్రతిపాదన తిరస్కరణ
ఉద్రిక్తతలు తగ్గించడానికి లేదా అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి రెండు దేశాలు చేసిన రాజీ ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా మొజ్తాబా ఖమేనీ తిరస్కరించినట్లు ఇరాన్ అధికారిని ఉటంకిస్తూ రాయ్‌టర్స్ వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది. విదేశాంగ విధానంపై నిర్వహించిన తొలి సమావేశంలో అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలన్న మొజ్తాబా వైఖరి చాలా బలంగా, తీవ్రంగా ఉందని అ ధికారి పేర్కొన్నట్లు వార్తాసంస్థ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ ఓటమిని అంగీకరించి, నష్ట పరిహారాన్ని చెల్లించి తమ ముందు మోకరిల్ల చేసేవరకు శాంతికి ఇది తగిన సమయం కాదని మొజ్తాబా స్పష్టం చేసినట్లు ఆ అధికారి చెప్పారు.
‘కొత్త వియత్నాంను ఎదుర్కోవాల్సి వస్తుంది’
అమెరికా యుద్ధానికి సైనిక దళాలను తమ భూ భాగం పైకి పంపితే కొత్త వియత్నాంను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి సయీద్ ఖటీబ్జాదే హెచ్చరించారు. అవసరమైతే ఎంత కాలమైనా యుద్ధం చేయడానికి ఇరాన్ సిద్ధమని టెహ్రాన్‌లోని తన కార్యాలయం నుంచి స్కై న్యూస్‌తో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణను శాశ్వతంగా ముగించే ప్రతిపాదనతో ముందుకు రావాల్సిన బాధ్యత అమెరికా, దాని మిత్ర దేశాలదేనని ఆయన స్పష్టం చేశారు.
గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి
యుద్ధం 18వ రోజుకు చేరుకున్నప్పటికీ పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు ఆగడం లేదు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని షా గ్యాస్ క్షేతం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో అక్కడ పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో కార్యకలాపాలను ఆపేశారు. విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగి అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ దాడిలో ఎవరూ గాయపడ లేదని అక్కడి అధికారులు తెలిపారు. గ్యాస్ క్షేత్రంపై దాడితో పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగ వ్యాపించిందని స్థానికులు తెలిపారు. కాగా, యూఏఈ తూర్పు తీరంలో ఉన్న చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగింది. పుజైరా సమీపంలోని ఒమన్ గల్ఫ్‌లో జరిగిన ఈ దాడిలో ఆ నౌక స్పల్పంగా దెబ్బతిందని యూకే మారిటైమ్ ట్రేడ్ అపరేషన్స్ పేర్కొంది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని, ఇరానే ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్నట్టు తెలిపింది.
అమెరికా యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతూ ఇరాన్ చుట్టూ అమెరికా యుద్ధనౌకలను మోహరించిన తరుణంలో అణుశక్తితో నడిచే ప్రపంచంలోనే అతి పెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. మంటలను ఆర్పేందుకు 30 గంటలకు పైగా సమయం పట్టిందని, నౌకలోని దాదాపు 600 మంది నావికులు, సిబ్బందికి నిద్రించడానికి పరుపులు కూడా లేకుండా పోయాయని కూడా పత్రిక పేర్కొంది. నౌకలోని ప్రధాన లాండ్రీలో మంటలు రాజుకున్నాయని, అక్కడి నుంచి నౌకలోని ఇతర భాగాలకు విస్తరించాయని తెలిపింది. అయితే మంటలకు కారణం తెలియరానప్పటికీ నౌకకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నదని సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనలో ముగ్గురు నావికులు గాయపడ్డారు. ఈ యుద్ధనౌకలో 4,500 మంది నావికులు, ఇతర సిబ్బంది ఉండే సామర్థ్యం ఉన్నది.
ఇరాన్‌పై యుద్ధాన్ని సమర్థించలేను ; అమెరికా ఎన్సీటీసీ డైరెక్టర్ రాజీనామా
ఇరాన్‌పై ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి తాను మనస్సాక్షికి విరుద్ధంగా మద్దతు ఇవ్వలేనని పేర్కొంటూ అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం(ఎన్సీటీసీ) డైరెక్టర్ జో కెంట్ మంగళవారం తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఇరాన్ వల్ల తమ దేశానికి వచ్చిన తక్షణ ముప్పేమీ లేదని, ఇజ్రాయెల్, దాని శక్తివంతమైన అమెరికన్ లాబీ ఒత్తిడి కారణంగానే అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించిందనేది స్పష్టమని కెంట్ వ్యాఖ్యానించారు. మితవాద తీవ్రవాదులతో సంబంధాలున్న మాజీ రాజకీయ అభ్యర్థి కెంట్ నిరుడు జూలైలో ఎన్సీటీసీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.కెంట్ రాజీనామాపై ట్రంప్ స్పందిస్తూ..అతడి రాజీనామా మంచి విషయమని.. భద్రతా వ్యవహారాల పర్యవేక్షణలో అతడు బలహీనుడని విమర్శించారు.