కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు హిమాన్షు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న భావోద్వేగ సందేశం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ హిమాన్షు ఎక్స్(ట్విట్టర్) వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా, మన ఇంట్లో ఉండే ప్రశాంతతను, సంతోషాన్ని మీరు ఎప్పుడూ దూరమవ్వనివ్వలేదు. తండ్రీకొడుకుల మధ్య ప్రత్యేక బంధం తకువగా ఉంటుందని కొందరు అంటుంటారు.
కానీ, నా తండ్రే నాకు మంచి స్నేహితుడిగా, గొప్ప మార్గదర్శకుడిగా ఉండటం నా అదృష్టం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిమాన్షు ఒక ప్రత్యేక రీల్‌ను షేర్ చేశారు. కేటీఆర్ లాంటి గొప్ప వ్యక్తికి కుమారుడిగా జన్మించడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. తాను షేర్ చేసిన రీల్లో ప్రతి సాహిత్యం తన తండ్రినీ, ఆయన వ్యక్తిత్వాన్నీ గుర్తుచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం హిమాన్షు చేసిన ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.