హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ‘సాధారణంగా పుట్టినరోజు అంటే ప్రశాంతంగా గడుపాలని అనుకున్నా.. మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం.. తెల్లారి లేస్తే పోరాటమే.. ఉదయం ధర్నా అయినా, సాయంత్రం కుస్తీ అయినా ఫైటింగ్ మోడ్‌లోనే ఉండాలి’ అని పిలుపునిచ్చారు. కేటీఆర్ 50వ పుట్టిన రోజును పురసరించుకుని హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం ‘కేటీఆర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్’ పేరుతో బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తలసాని కుటుంబానికి కుస్తీతో ఎంతో అనుబంధం ఉన్నదని, ఆయన తండ్రి కూడా ప్రముఖ పహిల్వాన్ అని గుర్తుచేశారు. అందుకే రెజ్లింగ్ క్రీడాకారులపై ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పారు. హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యే సుమారు 150 మంది రెజ్లర్లకు షూలు, శిక్షణ, ఇతర ఖర్చులను భరించే బాధ్యతను తలసాని తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేలా మౌలిక సదుపాయాలు, అభివృద్ధిపై విస్తృతంగా పనిచేశామని కేటీఆర్ చెప్పారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి అన్ని రకాల క్రీడలకు పెద్దపీట వేసేలా సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తన జన్మదినం సందర్భంగా తరలివచ్చిన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
మల్లయుద్ధానికి మహాభారత కాలం నుంచే గొప్ప చరిత్ర ఉన్నదని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. హైదరాబాద్ నుంచి ఏటా సుమారు 150 మందికి అవసరమైన శిక్షణ, క్రీడాసామగ్రి, ఇతర సదుపాయాలన్నింటినీ అందించే బాధ్యతను తీసుకుంటున్నానని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు తలసాని సాయికిరణ్ యాదవ్, పలు అఖాడాలకు చెందిన రెజ్లర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.