చందంపేట(నేరెడుగొమ్ము), సెప్టెంబర్ 11 : నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండలంలోని పందిరిగుండు తండా వాసులు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం గిరిజన తండాల్లో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతుండటం.. చెరువులు వట్టిపోతుండడంతో వర్షాకాలం సీజన్లోనే తాగునీటికి గోస పడాల్సిన పరిస్థితి నెలకొంది పందిరిగుండుతండాతోపాటు ఇంద్రావత్తండా, పై మూలవాగుతండ, కింది మూలవాగుతండాలు మెండికత్తువ చెరువులోని నీటి సామర్థ్యం ఆధారంగా బోర్ల ద్వారా నీటి అవసరాలకు వినియోగించుకునే వారు. మూలవాగుతండా సమీపంలో ఉన్న మెండికత్తువ చెరువుకు పెండ్లిపాకల నుంచి నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెండ్లిపాకల చెరువు నుంచి నీరు రాకపోవడంతో మొండికత్తువ చెరువు ఎండిపోయింది.
పందిరిగుండుతండా గ్రామపంచాయతీ పరిధిలోని ఇంద్రావత్ తండా, పై మూలవాగు తండా, కింది మూలవాగు తండాల్లో సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం వేసవిని తలపించేలా నీటి ఎద్దడి ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ల ద్వారా అందించే నీరు తమ అవసరాలకు సరిపోవడం లేదని తండావాసులు వాపోతున్నారు. గతంలో ఎన్నడూ ఇంతలా నీటి ఎద్దడిని ఎదుర్కోలేదని తండావాసులు చెప్తున్నారు. దీనికి తోడు మిషన్ భగీరథ నీరు అరకొరగా వస్తున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మెండికత్తువ చెరువు ఎండిపోవడంతో నెల రోజులుగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్టు చెప్తున్నారు.
మాకు మెండికత్తువ చెరువు నీరే ఆధారం. ఇప్పుడు వానలు పడుతలేవ్. చెరువు ఎండిపోయింది. దీంతో ఊర్లో నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నం. వానకాలంలోనే ఇంత నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధగా ఉంది. ఇప్పుడే నీటి సమస్య ఇలా ఉంటే వేసవి వస్తే గోసను ఊహించలేం. ప్రభుత్వమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. నీటి గోస తీర్చాలి.
నేరెడుగొమ్ము నుంచి కేతేపల్లికి వెళ్లే రహదారికి సంబంధించి మరమ్మతు పనులు కొనసాగుతుండటంతో పైప్లైన్ లీకేజి ఏర్పడింది. ఈ కారణంగా కొన్ని రోజుల పాటు పలు తండాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. తిమ్మాపురంలో కూడా మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు సంబంధించి మరమ్మతులు నిర్వహిస్తున్నాం. సాధ్యమైనంత త్వరలోనే మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తాం.