ఇళయరాజాకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. ‘పాట’ హక్కులపై ఎడతెగని వివాదాలు
ఓ పాట పుట్టుక వెనక ఎంతో మంది శ్రమదాగి ఉంటుంది. సంగీతం, సాహిత్యం, గానం కలబోతగా రూపుదిద్దుకునే పాటను ప్రజా బాహుళ్యంలోకి చేరవేయడానికి తెరవెనక ఎంతో కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓ పాట సినిమాలో భాగమైన తర్వాత దాని తాలూకు సంపూర్ణ హక్కులు ఎవరికి చెందుతాయి? పాటను రికార్డ్ చేసిన సంస్థలకా? లేదా పాటలో భాగమైన వ్యక్తులకా? అన్నది ఇప్పుడు సంగీత ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అగ్ర సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల చుట్టూ ముసురుతున్న కాపీరైట్ వివాదాలు, వాటిపై న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులు ‘పాట హక్కు’పై అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి.
‘మూడు పాని’ సినిమాలోని ‘ఎన్ ఇనియా పొన్ నిలవే’ పాట రీక్రియేషన్ వివాదంపై గురువారం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పిన అత్యున్నత న్యాయస్థానం..ఇళయరాజా అప్పీల్‌ను తోసిపుచ్చింది. పాటలకు సంబంధించి కేవలం ట్యూన్‌పై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని, సాహిత్యం, సౌండ్ రికార్డింగ్ వంటి వాటిపై కాపీరైట్ హక్కులు ఆయనకు ఉండవని తేల్చిచెప్పింది. ‘మూడు పాని’ పాట విషయంలో ‘సరిగమ’ మ్యూజిక్ సంస్థకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ‘ఎన్ ఇనియా పొన్ నిలవే’ అనే పాటను గత ఏడాది విడుదలైన ‘అఘాతియా’ చిత్రంలో రీక్రియేట్ చేయడంపై ఇళయరాజా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదం నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది.
‘మూడు పాని’ పాట వివాదం గురించి..
1980లో విడుదలైన ‘మూడు పాని’ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్నందించారు. ఈ సినిమా మ్యూజిక్ హక్కులను ‘సరిగమ’ సంస్థ కలిగి ఉంది. ‘ఆఘతియా’ చిత్రంలో తన అనుమతి లేకుండా పాటను పునఃసృష్టించడంపై ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పాటపై తమకు కాపీరైట్ హక్కు ఉందని ‘సరిగమ’ సంస్థ కూడా కోర్టుమెట్లెక్కింది. ఢిల్లీ హైకోర్టు ఈ వివాదానికి సంబంధించి సంగీతం, సాహిత్యం, సౌండ్ రికార్డింగ్ హక్కులను విడివిడిగా పరిశీలించిన అనంతరం స్టే విధించింది. దీనిపై ఇళయరాజా సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.
పాటకు వేర్వేరు కాపీరైట్ హక్కులు..
‘మూడు పాని’ పాట వివాదంలో కోర్టు మూడు వేర్వేరు అంశాలను కాపీరైట్‌గా గుర్తించింది. సంగీత కూర్పునకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్‌కు, సాహిత్యపరంగా రచయితకు, సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించి చట్టబద్ద హక్కులు నిర్మాత లేదా హక్కులు పొందిన రికార్డింగ్ సంస్థకు ఉంటాయని స్పష్టం చేసింది. అంటే ‘పాటపై సర్వహక్కులూ నావే’ అనే మాటకు కాపీరైట్ చట్టంలో అంత సులభంగా వివరణ ఇవ్వలేమన్నది కోర్టు అభిప్రాయంగా ఉంది. పాటలోని ఒక్కో అంశాలనికి ఒక్కో హక్కుదారుడు ఉంటాడని, కాపీరైట్ విషయంలో అదే ప్రధానమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ద్వారా అర్థమవుతున్నది. ‘మూడుపాని’ పాట వివాదంలో ఇళయరాజా సంగీత కూర్పుకు సంబంధించిన కాపీరైట్‌ను మాత్రమే కలిగి ఉన్నారని కోర్టు స్పష్టం చేసింది. పాట సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌పై ఆయనకు హక్కులేదని పేర్కొన్నది.
పాట కాపీరైట్ ఇప్పుడు కోట్ల వ్యాపారం
ఇళయరాజా పాటల చుట్టూ జరుగుతున్న న్యాయపోరాటం కేవలం వ్యక్తిగత హక్కుల సమస్య మాత్రమే కాదని, భారతీయ సంగీత పరిశ్రమలో పెనుమార్పును సూచిస్తున్నదని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాట క్యాసెట్ వరకే పరిమితమైన కాలంలో రికార్డింగ్ కంపెనీలదే గుత్తాధిపత్యంగా కనిపించేది. కానీ నేటి డిజిటల్ స్ట్రీమింగ్ యుగంలో కాపీరైట్ విలువ అనూహ్యంగా పెరిగింది. యూట్యూబ్‌తో పాటు వివిధ డిజిటల్ వేదికల్లో పాటలను విస్త్రృతంగా వినియోగించడం, రీమిక్స్, రీక్రియేషన్, వాణిజ్య ప్రకటనల్లో వాడటం.. ఇలా పాటకు అనేక మార్గాల్లో ఆర్థిక విలువ పెరిగింది. అందుకే పాత పాటల కాపీరైట్ ఎవరిదనే ప్రశ్నల వెనక కోట్ల రూపాయల వ్యాపారం దాగి ఉంది.
కాపీరైట్స్పై ఇళయరాజా సుదీర్ఘ పోరాటం
పాటల కాపీరైట్ విషయంలో ఇళయరాజా పోరాటం ఇప్పటిది కాదు. 1990 దశకంలోనే అందుకు బీజం పడింది. 1981లో ఇళయరాజా తన సన్నిహితుడు ఎం.ఆర్.సుబ్రమణ్యంతో కలిసి ఎకో రికార్డింగ్ కంపెనీని ప్రారంభించారు. ఆయన పాటల హక్కులన్నీ ఆ సంస్థతో అనుసంధానమయ్యాయి. 1992లో ఇళయరాజా ‘ఎకో’ సంస్థ నుంచి విడిపోయారు. క్యాసెట్ విక్రయాల నుంచి తగిన రాయల్టీ అందడం లేదని ఆరోపించారు. 2014లో ఆ సంస్థపై న్యాయపోరాటం ప్రారంభించారు. 2013-2019 నడుమ మలేషియాకు చెందిన ఏజీఐ మ్యూజిక్ సంస్థతో ఇళయరాజాకు కాపీరైట్ వివాదం ఏర్పడింది. కేవలం ఐదేళ్ల వరకే పరిమితమైన మ్యూజిక్ హక్కులను సదరు సంస్థ ఉల్లఘించిందని, పదేళ్లుగా అనుభవిస్తున్నదని ఇళయరాజా కోర్టుకెక్కారు.
2019లో మద్రాస్ హైకోర్టు ఇళయరాజా వాదనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇళయరాజా కాపీరైట్ వివాదాల పరంపరలో అత్యంత సంచలనమైంది దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి లీగల్ నోటీసులు పంపించడం. సంగీత కచేరీల్లో తన పాటలను అనుమతి లేకుండా ఎస్పీబీ వాడుకుంటున్నాడని, అందుకు రాయల్టీ చెల్లించాలని 2017లో ఆయనకు కోర్టు నోటీసులు పంపించారు ఇళయరాజా. వీటితో పాటు తన పాటలను అనుమతి లేకుండా వాడుతున్నారని వివిధ నిర్మాణ సంస్థలపై కోర్టుకెక్కారాయన. అయితే కాపీరైట్ విషయంలో ‘సరిగమ’ సంస్థపై మాత్రం భారీ పోరాటాన్నే చేస్తున్నారు ఇళయరాజా. సరిగమ వర్సెస్ ఇళయరాజా పోరులో దాదాపు 134 చిత్రాలకు సంబంధించిన పాటలు వివాదంలో ఉన్నాయి.
తాము నిర్మాతల నుంచి తీసుకున్న హక్కులను దాటి ఇళయరాజా మూడో వ్యక్తులకు పాటలపై లైసెన్స్ ఇస్తున్నారని, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్ వినియోగానికి సంబంధించి హక్కులను కోరుతున్నారని సరిగమ సంస్థ ఆరోపిస్తున్నది.అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ మాత్రం ఈ పరిణామాలను మరో కోణంలో విశ్లేషిస్తున్నది. ఇది కేవలం ఇళయరాజాకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని, 1970-90 దశకంలో సంగీతపరంగా కుదిరిన ఒప్పందాలు, నిర్మాతల, రికార్డింగ్ కంపెనీల, సంగీత దర్శకుల హక్కులు, కొత్తగా వచ్చి చేరిన డిజిటల్ రైట్స్.. ఇవన్నీ ఒకదానితో ఒకటి వ్యాపారపరంగా సంఘర్షించుకుంటున్న వైనానికి అద్దం పడుతున్నదని అంటున్నారు.