హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): సిరిసిల్ల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభ ప్రజలను మభ్యపెట్టడానికే పరిమితమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్ల పర్యటన సందర్భంగా ఏదో జరుగబోతున్నదని కాంగ్రెస్ నాయకులు గత పది రోజులుగా భారీ ప్రచారం చేసి, తీరా సభలో మాత్రం ప్రజలకు ఎలాంటి ప్రయోజనకరమైన ప్రకటనలు చేయకుండా నిరాశపరిచారని దుయ్యబట్టారు.
సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి విధానాలు, కార్యాచరణను పకనపెట్టి, పాత పద్ధతిలోనే వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ నేతన్నల సంక్షేమం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. బతుకమ్మ చీరల తయారీ, పంపిణీ బాధ్యతలను నేరుగా సిరిసిల్ల నేత కార్మికులకే అప్పగించి వారికి చేతినిండా పని, గౌరవప్రదమైన ఉపాధి కల్పించారని, దేశంలో ఎకడా లేని విధంగా ‘నేతన్న బీమా’ వంటి అద్భుత పథకాన్ని బీఆర్ఎస్ పాలనలోనే అమల్లోకి తెచ్చామని వివరించారు.
నేడు సంక్షోభంలో చేనేత రంగం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఎల్ రమణ విమర్శించారు. 2024 జనవరి 20 నుంచి ఇప్పటివరకు దాదాపు 54 మంది నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇవన్నీ ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల ఆత్మహత్యల నివారణకు సమగ్రమైన చర్యలు తీసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. నేతన్నలకు రూ.1,753 కోట్లు ఇచ్చినట్టు చెప్తున్న ప్రభుత్వం.. ఆ నిధులతో అసలు ఎవరికి లబ్ధి చేకూరిందో పూర్తి వివరాలను శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
మీరు పని ఇవ్వండి.. నేను వాళ్లతో పనిచేయిస్తా
నేతన్నలకు పని కల్పిస్తున్నా వారు ముందుకు రావడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ రమణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు పని కల్పిస్తే, వారితో నిబద్ధతతో పనిచేయించే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. కేసీఆర్ ఉద్యమ సమయంలోనే తనవంతుగా రూ.50 లక్షలు సమకూర్చి నేతన్నలను ఆదుకున్న చరిత్ర ఉన్నదని, ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు మాత్రం తప్పుడు లెకలతో, కాకి లెకలతో కార్మికులను నమ్మించి వంచించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సభను పార్టీ సభలా మార్చారు
సిరిసిల్లలో నిర్వహించిన అధికారిక సభను సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజకీయ సభలా మార్చేశారని ఎల్ రమణ దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు గౌతంప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.