నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 1: కరెంట్ కోతలపై రైతులు భగ్గుమంటున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు కరెంట్ లేక నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కరెంట్ కోతలను నిరసిస్తూ గురువారం రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కారు. సబ్స్టేషన్లను ముట్టడించడంతోపాటు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కరెంట్ కోతలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం కోడూర్లో రైతులు ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించారు. 12 గంటల విద్యుత్తు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా, కనీసం నాలుగు గంటలు కూడా సక్రమంగా రావడం లేదని రైతులు మండిపడుతున్నారు. కోడూర్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఆపరేటర్లు, లైన్మెన్లు, ఏఈలు ఎవరూ సమస్య పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడ్పల్ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. సమయపాలన లేని కరెంట్ సరఫరాపై అధికారులను నిలదీశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లోని సబ్‌స్టేషన్‌ను సంగంబండ, మద్వార్ గ్రామాల రైతులు ముట్టడించారు. అనంతరం అక్కడే జాతీయ రహదారిపై బైఠాయించారు. కోతలు లేని విద్యుత్తును సరఫరా చేస్తామని ఏడీ హామీతో రైతులు ధర్నా విరమించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లింగాపూర్‌లో రైతులు పంటకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. నిజాంపూర్ ఎత్తిపోతల పథకం మీద ఆధారపడి రైతులు పంటలు వేసుకున్నామని, మోటర్లు పనిచేయక, సాగునీరందక దాదాపు 80 ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో కడుపు మండిన రైతన్న ఎండిన పంటకు నిప్పుపెట్టి బోరున విలపించారు.
మోటర్లకు మరమ్మతులు చేయించకపోతే మరో 400 ఎకరాల్లోని పంటలు కూడా ఎండిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలోని సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. కరెంట్ ఎప్పుడు వస్తున్నదో, ఎప్పుడు పోతున్నదో తెలుస్తలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద రోడ్డుపై కాలిన మోటర్లను పెట్టి రైతులు ధర్నా చేశారు. నెల రోజులుగా లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడి ఫ్యూజ్ వైర్లు పోతున్నాయని, తరుచూ మోటర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వీరికి ఆందోళనకు అఖిలపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు.

రైతులపై పోలీసుల నిర్బంధం
కల్వకుర్తి, అక్టోబర్ 1 : వ్యవసాయానికి కరెంట్ 8, 9 గంటలు మాత్రమే సరఫరా అవుతుందని, అందులో 2, 3 గంటలు ట్రిప్ అవుతుందని సెప్టెంబర్ 10న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామం వద్ద హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఆరుగురు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తిమ్మరాశిపల్లికి చెందిన రైతు సంఘం నేత గోవర్ధన్‌రెడ్డి, తాండ్రకు చెందిన రైతులు మైబు, మల్లయ్య, హనుమంతు, ఆంజనేయులుతోపాటు మరో రైతుపై కేసులు పెట్టారు. విచారణకు హాజరుకావాలని తాండ్ర రైతులకు పోలీసులు నోటీసులు పంపారు.
