న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 : దేశంలో మళ్లీ బొగ్గు సంక్షోభం ముంచుకొస్తున్నది. అనేక విద్యుదుత్పత్తి ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వేడి వాతావరణం కారణంగా విద్యుత్తు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశంలోని మూడింట ఒక వంతు బొగ్గు ఆధారిత విద్యుత్తు ప్లాంట్లు అత్యంత తక్కువ ఇంధన నిల్వలతో పనిచేస్తున్నాయి. పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నదని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. మే నెలలో నమోదైన రికార్డు స్థాయి 270.70 గిగావాట్ల (జీడబ్ల్యూ)కు దగ్గరగానే దేశంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ ఇప్పుడూ కొనసాగుతున్నది. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల కారణంగా శీతలీకరణ అవసరాలు పెరగడంతో గత కొన్ని రోజులుగా విద్యుచ్ఛక్తి డిమాండ్ స్థిరంగా సుమారు 267 గిగావాట్ల స్థాయిని తాకుతున్నది. కేంద్ర విద్యుచ్ఛక్తి సంస్థ(సీఈఏ) గణాంకాల ప్రకారం బొగ్గు నిల్వలు అత్యంత తక్కువగా ఉన్న(అంటే అవసరమైన నిల్వలో 25% కంటే తక్కువ కాలం విద్యుదుత్పత్తికి సరిపడా ఇంధనం మాత్రమే ఉన్న) విద్యుచ్ఛక్తి కేంద్రాల సంఖ్య ఆగస్టు చివరి నాటికి 45గా ఉండగా సెప్టెంబర్ 6 నాటికి అది గణనీయంగా పెరిగి 50కి చేరింది.
బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ విశ్లేషకుడు మనోజ్ కుమార్ అన్నారు. పగటిపూట విద్యుచ్ఛక్తి డిమాండ్‌లో అధిక వాటాను స్వచ్ఛ ఇంధనం, ముఖ్యంగా సౌరశక్తి తీరుస్తున్నప్పటికీ పరిమితి బ్యాటరీ నిల్వ, తగ్గుతున్న జలాశయాల నీటిమట్టాలు బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిపై అధిక ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషకులు తెలిపారు. బొగ్గు నిల్వలను సాధారణ స్థాయిల్లో ఉంచేందుకు ముఖ్యంగా రైలు నెట్వర్క్ ద్వారా విద్యుచ్ఛక్తి సంస్థలకు బొగ్గు సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని కుమార్ పేర్కొన్నారు. దేశంలో గతంలోనూ బొగ్గు సంక్షోభం నెలకొన్న దృష్ట్యా మోదీ సర్కార్ గత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌నినో, విద్యుత్తు డిమాండ్‌పై అవగాహన ఉన్నప్పటికీ బొగ్గు సరఫరాను పెంచే చర్యలను చేపట్టలేదని విమర్శిస్తున్నారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. విద్యుత్తు కోతలను వెంట తెచ్చింది’ అని కేరళలో కొనసాగుతున్న విద్యుత్తు కోతలపై పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సామాజిక మాధ్యమంలో ఫిర్యాదులు, వెల్లువెత్తుతుండగా, మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీ, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు (కేఎస్ఈబీ) తీరుపై మీమ్స్, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రాత్రి పూట గంటకు పైగా విద్యుత్తు కోతను అమలు చేస్తున్నారని, కొన్ని చోట్లయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా విద్యుత్తును బంద్ చేస్తున్నారని పౌరులు ఆరోపిస్తున్నారు. ఈ కోతలతో నిద్రపట్టక పిల్లలు, వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు, ఇంట్లో పసిపిల్లలు ఉన్న కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అర్ధరాత్రి ఎందుకు కోతలు విధిస్తున్నారని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ఎంతసేపు విద్యుత్తు కోత విధిస్తారో ముందస్తుగానైనా తెలియజేయాలని వారు కేఎస్ఈబీని డిమాండ్ చేస్తున్నారు.
కేరళలో వేళాపాళా లేకుండా విద్యుత్ కోతలు విధించడాన్ని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి సన్నీ జోసెఫ్ సమర్థించుకున్నారు. రాష్ట్రంలో కరెంట్ వినియోగం భారీగా పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదన్నారు. ఇటీవలి కాలంలో పలు భవనాల నిర్మాణం జరిగిందని, ప్రతి ఇంటిలో ఏసీ ఉంటున్నదని, ఏసీల వాడకం వల్ల కూడా కరెంట్ వినియోగం అనూహ్యంగా పెరిగిపోయినట్టు ఆయన వివరించారు. ‘ప్రతి రోజు ఒకటి కంటే ఎక్కువసార్లు కరెంట్ కోత విధించాల్సిన పరిస్థితిలో ఉన్నాం’ అని ఆయన రాష్ట్ర దుస్థితి గురించి వ్యాఖ్యానించారు. కేఎస్ఈబీ చైర్మన్, ఇతర అధికారులతో చర్చించి పరిస్థితిని సమీక్షించనున్నట్టు ఆయన చెప్పారు. కాగా, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు దశాబ్దం తర్వాత కేరళ ప్రజలకు కరెంట్ కోతలను కానుకగా ఇచ్చిందని విపక్ష లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) విమర్శించింది.