హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కోల్‌కతా జోనల్ కార్యాలయానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్‌కు సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఎస్ఆర్ఈఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎస్ఆర్ఈఎల్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి తీసుకున్న రుణాలు, చెల్లింపులో జరిగిన అక్రమాలపై సాగుతున్న కేసుతో సంబంధం ఉన్నట్టు వెల్లడైంది.
రుణాలను పాత రుణాల చెల్లింపులకు ఉపయోగించడం, నిధుల మళ్లింపు, ఎవర్‌గ్రీనింగ్, రౌండ్ ట్రిప్పింగ్ వంటి ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.