వికారాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నది. ప్రతి ఏటా జిల్లాలోని కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు పట్టుపడుతున్నప్పటికీ నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ విత్తనాల ముఠా కర్నాటక సరిహద్దు కేంద్రంగా నడిపిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు కర్నాటక రాష్ట్రం సరిహద్దు ప్రాంతమైన గుల్బర్గా ప్రాంతంలో నివాసముంటూ దందాను నడిపిస్తూ అక్రమంగా జిల్లాకు నకిలీ విత్తనాలను తరలిస్తున్నట్లు తెలిసింది.
కొడంగల్, తాండూరు ప్రాంతాల్లో పట్టుబడినవారంతా గుల్బర్గా ప్రాంతంలో ఉంటున్న ఆంధ్రా ప్రాంతంవారే. నకిలీ విత్తనాల దందా నడిపిస్తున్న వారి వివరాలు తెలిసినప్పటికీ కేవలం వారి వద్ద లభించిన నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేస్తూ జిల్లాకు అక్రమంగా నకిలీ విత్తనాల తరలింపును మాత్రం అడ్డుకట్ట వేయడం లేదనే విమర్శలు పోలీసులపై వినిపిస్తున్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో చెక్‌పోస్టులు నామమాత్రంగా మారిపోయాయి. సరిహద్దుల వద్ద నిఘా పెంచి తనిఖీలు చేయాల్సిన పోలీసులు.. జిల్లాలోకి అక్రమంగా తరలించిన అనంతరం సీజ్ చేస్తూ గొప్పలు చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నాటక నుంచి విత్తనాలను తరలిస్తున్నారనే సమాచారం ఉన్నప్పుడు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచడం లేదనే ఆరోపణలున్నాయి.
గత రెండు నెలల్లో సుమారు రూ.50 లక్షలకుపైగా విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు జిల్లాలో రెండు నెలల క్రితం, తాజాగా విత్తనాలతో పట్టుబడిన నిందితులందరూ కర్నాటక సరిహద్దు ప్రాంతానికి చెందినవారే అని తెలిసినప్పటికీ పోలీసులు సరిహద్దు వద్ద నిఘా పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోనే నకిలీ విత్తనాలను తయారు చేస్తున్నారా లేదంటే కర్నాటక సరిహద్దులో తయారు చేస్తున్నారా అనేది తేల్చి నకిలీ విత్తనాల మూలాలు లేకుండా చేయాల్సిన టాస్క్‌ఫోర్స్ బృందం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులకు ఏదో రకంగా నష్టాలే మిగులుతున్నాయి. అకాల వర్షాలు, సరైన మద్దతు ధర లేకపోవడంతోపాటు నకిలీ విత్తనాలతో పత్తి రైతులు చిత్తవుతున్నారు. అకాల వర్షాలతో రెండు, మూడేండ్లకోసారి పత్తి రైతులు నష్టపోతున్నా.. నకిలీ విత్తనాలతో మాత్రం ప్రతి ఏటా జిల్లా రైతాంగం నష్టపోతూనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కనీసం పెట్టుబడి సాయాన్ని కూడా అర్హులైన రైతులందరికీ అందించని దుస్థితిలో ఉండగా.. నకిలీ విత్తనాలతో అన్నదాతలు మరింత నష్టాల్లో కూరుకుపోతున్నారు. నకిలీ పత్తి విత్తనాల బారిన పడిన రైతులు పెట్టుబడికి తెచ్చిన అప్పులకు వడ్డీలను కూడా చెల్లించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యంగా పత్తి రైతు విత్తనాలు మొదలుకొని పత్తిని విక్రయించే వరకూ మోసపోతున్నారు. ప్రధానంగా పంటల సాగుకు చేసిన అప్పులు, మరోవైపు నకిలీ విత్తనాల బారిన పడి రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రతి ఏటా కర్నాటక నుంచి జిల్లాకు వందల క్వింటాళ్లలో నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా తరలిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. గుట్టుచప్పుడు కాకుండా వందల క్వింటాళ్ల విత్తనాలను జిల్లాకు అక్రమంగా తరలిస్తూ అమాయక రైతులకు విక్రయిసున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు రూ.50 లక్షల విలువ చేసే 30 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారికంగా సీజ్ చేశారు. రెండు నెలల క్రితం జిల్లాలోని పెద్దేముల్ మండలంలో రూ.10 లక్షల విలువైన విత్తనాలను సీజ్ చేసిన అధికారులు కర్నాటక ప్రాంతానికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా యాలాల మండలంలో రూ.44 లక్షల విలువ చేసే 28 క్వింటాళ్ల విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులను అరెస్ట్ చేశారు.
నకిలీ పత్తి విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కర్నాటక సరిహద్దు వద్ద కూడా నిఘా పెంచి నకిలీ విత్తనాలను జిల్లాకు తరలించకుండా నిఘా పెంచుతామన్నారు. మరోవైపు విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని ఎస్పీ సూచించారు.