Manchala | మంచాల, మార్చి 17 : కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లలో వ్యవసాయం పండుగలా ఉండేది. ఇప్పుడు మాత్రం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కరువు ఒక్కసారిగా విలయతాండవం చేయడంతో పంటలు ఎండిపోతుండడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అంటూ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది మంచాల మండలం బండలేమూరు గ్రామంలోని రైతుల ఆవేదన.. భూగర్భజలాలు అడుగంటి పోతుండడంతో వ్యవసాయ బోరుబావుల్లో నీరు ఒక్కసారిగా తగ్గిపోవడంతో వరి పంట చేతికి అందే దశలో ఎండిపోతుండడంతో అది చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న వరి చేనులు ఒక్కసారిగా బోరు బావులు తగ్గిపోవడంతో కండ్ల ముందే పంట ఎండిపోతుండడంతో ఏమీ చేయాలో తెలియక రైతులు పొలాలను పశువులు, మేకలు, గొర్రెలకు ఎండుతున్న వరి చేనులను మేపుతున్నారు. గతంలో ఇంత కరువు రాలేదని సంవత్సరంలో రెండు పంటలను పండించుకోని ధాన్యాన్ని ఎంతో సంతోషంగా ఇంటికి తీసుకొచ్చేవారము ఇప్పుడు కండ్లముందే పంట ఎండిపోతుంటే చేసిన అప్పు ఎలా తీర్చాలో దేవుడా అంటూ అవేధన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు చేతినిండా పనిఉండే.. ఎప్పుడు ఉట్టిగా ఉంటోళ్లం కాదు. నాకు ఉన్న నాలుగు ఎకరాల్లో వరిని సాగుచేసుకున్న కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతుబంధు, రుణమాఫీ అయ్యింది. ఇప్పుడు రేవంత్రెడ్డి వచ్చినంక రైతు భరోసా ఇప్పటి వరకు రాలేదు. అప్పులు చేసి పంటలు సాగుచేసుకుంటే బోర్లల్లో నీళ్లు తగ్గినాయి. వరి పంటకు నీళ్లు దేవుడెరుగ కానీ పశువులకు కూడా నీళ్లు కష్టమే. నేను కాంగ్రెస్ కార్యకర్తను అయినప్పటికి కేసీఆర్ ఉన్నప్పుడే కాలం బాగా అయ్యింది.
నాకు ఉన్న రెండెకరాల పొలంలో వరి పంట సాగు కోసం అప్పుసప్పు చేసి రూ. 30 వేలు ఖర్చు పెట్టి వరి పంటసాగు చేసుకున్న, నా పొలంలో సంవత్సరంలోనే 3బోర్లు వేశాను. అందులో ఒక్క బోరులో నీళ్లు వచ్చినయి దాంతోనే పంటసాగు చేసుకున్న ఇప్పుడు ఆ బోరులో కూడా నీళ్లు తగ్గడంతో పంట ఎండిపోతుంది. నేను నాటేసిన రెండు ఎకరాలలో ఇప్పటికే సగానికి ఎక్కువ ఎండిపోయింది. ఇట్లే ఎండలు కొడితే ఉన్నపంట మొత్తం పోతుంది. నాకు రైతు భరోసాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడు పంట ఎండిపోతుంటే చేసిన అప్పు కోసం అప్పులోల్లు ఇంటికి వస్తే వారికి ఎలా భాకీ తీర్చాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంత బాధ పదేండ్లలో ఏనాడు కూడా కనిపించలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కరువు దరిదాపుల్లో కూడా రాలేదు. చెరువులు, కుంటలు నిండిపోవడంతో బోరుబావులల్లో నీళ్లు పుష్కలంగా ఉండేవి. ఆయననే గొప్పోడు.