Farmers | తాండూరు రూరల్, మే 1 : కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ప్రారంభించారు. కానీ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు మండలం, చెంగోల్ గ్రామ సమీపంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ధాన్యం కొనుగోలు కేంధ్రాన్ని అధికారులు ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగుల కోసం రైతులకు టోకేన్లు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బ్యాగులు ఇవ్వలేదని రైతు లాలప్ప ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇటీవల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యాన్ని తీసుకు వచ్చాం. కానీ వారం రోజుల నుంచి ఆడపాదడప వర్షం కురుస్తున్నది. రోడ్డుపై వేసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని ఆరబెడుతున్నామని రైతులు తెలిపారు. ధాన్యం ఆరిన తర్వాత కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారన్నారు. రోడ్డుపై ఎంత కాలం ఉండాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెంగోల్ వరి ధాన్యం కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గన్నీ బ్యాగుల కోసం టోకేన్లు ఇచ్చారు : రైతు లాలప్ప
గన్నీ బ్యాగుల కోసం అధికారులు టోకెన్లు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బ్యాగులు ఇవ్వలేదు. ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. తాండూరులోని డీసీఎంఎస్ కార్యాలయంలో వచ్చే సోమవారం నుంచి బ్యాగులు ఇస్తామని చెప్పారు. ఈలోపు మళ్ళీ వర్షం కురిస్తే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.